Breakfast: ఎండాకాలంలో పొద్దున్నే ఇది తింటే.. నీరసం అన్న మాటే ఉండదు

Ragi Flour and Moong Dal Makes Such a Healthy and Instant breakfast for summer

Ragi Flour and Moong Dal Makes Such a Healthy and Instant breakfast for summer

Breakfast: వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుతూ, రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే పోషకాహారం చాలా ముఖ్యం. అలాంటి సందర్భాల్లో రాగి, పెసరపప్పుతో చేసే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మంచి ఎంపిక. ఇది రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి చలువనిచ్చి, శక్తిని కూడా అందిస్తుంది.

ఈ వంటకం తయారీకి ముందుగా ఒక గ్లాసు రాగులను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు అవి బాగా నానిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే పరిమాణంలో పెసరపప్పును తీసుకుని తక్కువ మంటపై మాడిపోకుండా స్వల్పంగా వేయించాలి. మంచి వాసన వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా చల్లార్చి, శుభ్రంగా కడిగి, పప్పులు మునిగేంత నీరు పోసి సుమారు గంటపాటు నానబెట్టాలి.

తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాసు రాగులు, ఒక గ్లాసు పెసరపప్పుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకుని మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టిన రాగులను వేసి మధ్యస్థ మంటపై ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రాగులు సగం మెత్తబడిన తర్వాత నానబెట్టిన పెసరపప్పును అందులో కలపాలి. ఎందుకంటే పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా ఉడికించాలి. ఇది ఉడుకుతున్న కొద్దీ చిక్కబడుతుంది కాబట్టి అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. మిశ్రమం దగ్గరపడిన తర్వాత మూత పెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. పొంగకుండా ఉండేందుకు మూతను కొద్దిగా పక్కకు జరిపి ఉంచడం మంచిది.

మిశ్రమం పూర్తిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మీకు కావలసినంత చిక్కగా లేదా పల్చగా ఉండేలా చూసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారిన తర్వాత ఇది మరింత గట్టిపడుతుంది కాబట్టి అవసరమైతే వేడి నీళ్లు కలిపి మళ్లీ కొద్దిసేపు ఉడికించవచ్చు.

చివరగా తాలింపు కోసం ఒక స్పూన్ నెయ్యి వేడి చేసి జీలకర్ర, జీడిపప్పు, మిరియాల పొడి వేయించాలి. తరువాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి ఈ తాలింపును రాగి–పెసరపప్పు మిశ్రమంలో కలపాలి.

ఈ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను వేడివేడిగా వడ్డించుకోవచ్చు. ఇది కేవలం అల్పాహారం మాత్రమే కాదు, షుగర్ ఉన్నవారు లేదా బరువు తగ్గాలనుకునే వారు లంచ్ లేదా డిన్నర్‌గా కూడా తీసుకోవచ్చు. పొంగలి తరహాలో ఉండే ఈ వంటకం వేసవిలో శరీరానికి చలువనిచ్చి, రోజంతా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

Also Read: Energy Lockdown: ట్రెండ్ అవుతున్న ఎనర్జీ లాక్‌డౌన్.. దీనర్థం ఏంటంటే..

Breakfast: ఎండాకాలంలో పొద్దున్నే ఇది తింటే.. నీరసం అన్న మాటే ఉండదు