Obesity: ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం (Obesity) , డయాబెటిస్ (Diabetes) ముందంజలో ఉన్నాయి. ఈ రెండు వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రభావం చూపుతున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ప్రతి ఏడాది ప్రపంచంలో దాదాపు 5 కోట్ల 40 లక్షల మంది ఈ వ్యాధుల కారణంగా పని చేయలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. అంటే ఒక చిన్న దేశ జనాభా మొత్తం పనికి దూరమవుతున్నట్టే పరిస్థితి ఏర్పడుతోంది.
ఇలా కొనసాగితే భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. దీని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా భారీ భారం పడుతోంది. ఈ రెండు వ్యాధుల కారణంగా ప్రతి ఏడాది ప్రపంచానికి సుమారు 4 ట్రిలియన్ డాలర్ల నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక భారత్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. డయాబెటిస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. మన దేశానికి ఈ సమస్యల వల్ల పడుతున్న ఆర్థిక భారం దాదాపు 1.6 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. చిన్న వయసులోనే షుగర్ రావడం, ఆరోగ్య సమస్యల కారణంగా ఉద్యోగాలకు సెలవులు తీసుకోవడం లేదా త్వరగా రిటైర్ కావడం వంటి కారణాల వల్ల కంపెనీలు, దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలుగుతోంది.
అయితే ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితిని మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంపై పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్తులో అనేక రెట్లు లాభం తీసుకువస్తుందని వారు చెబుతున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే 2050 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదనంగా 11 ట్రిలియన్ డాలర్ల లాభం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని దేశాలు ఈ సమస్యను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఉదాహరణకు అమెరికాలో GLP-1 అనే కొత్త మందులను ఉపయోగించి ఊబకాయాన్ని దాదాపు 2 శాతం వరకు తగ్గించారు. ఇలాంటి చర్యలను ఇతర దేశాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
అంతిమంగా నిపుణులు చెబుతున్నది ఒక్కటే. జబ్బులు వచ్చిన తర్వాత చికిత్సకు ఖర్చు పెట్టడం కంటే ముందే వాటిని నివారించడం చాలా ముఖ్యమని వారు అంటున్నారు. ప్రభుత్వాలు, కంపెనీలు కలిసి ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచాలి. పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థలు బలపడతాయి, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది.
