Jana Nayagan: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం ‘జన నాయగన్(Jana Nayagan)’ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఎన్నో వివాదాలు, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, ఏడు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ చిత్రం జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి నటించిన సినిమా, ఆయన పదవిలో ఉండగా విడుదల కావడం భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే తొలిసారి. అందుకే స్క్రీన్ టైటిల్ కార్డ్‌పై విజయ్ను ‘గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి’ అని ప్రదర్శించేందుకు మేకర్స్ మార్పులు చేశారు.
ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట నారాయణ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దాదాపు 30కి పైగా దేశాల్లో 7,000 నుండి 8,000 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని, రాబోయే రోజుల్లో ఈ కౌంట్ మరికొంత పెరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. గతంలో లీకైన వెర్షన్‌తో పోలిస్తే ఇప్పుడు థియేటర్లలోకి రాబోతున్న సినిమా చాలా భిన్నంగా ఉంటుందని, కొత్తగా కొన్ని పాటలతో పాటు భారీ మార్పులు చేశామని తెలిపారు. భారతదేశంలో సెన్సార్ బోర్డు (CBFC) ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్ ఇచ్చి కొన్ని పొలిటికల్ డైలాగులను కట్ చేయగా, యూకే (UK) వంటి ఓవర్సీస్ మార్కెట్లలో మాత్రం ఎలాంటి కట్స్ లేకుండా ‘uncut’ వెర్షన్‌తో 15 రేటింగ్‌తో సినిమాను ప్రదర్శిస్తున్నారు.
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రాల సరసన ‘జన నాయగన్(Jana Nayagan)’ నిలిచింది. ‘పుష్ప-2’ 12,000 స్క్రీన్లతో టాప్‌లో ఉండగా, ‘జవాన్’ (10,000+), ‘కల్కి’ (9,500), ‘RRR’ (9,000) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు విజయ్ చివరి సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ వేడుకను ఎమోషనల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో జూలై 23 తెల్లవారుజామున 6 గంటల నుంచే షోలు ప్రారంభం కానుండగా, తమిళనాడులో ఆదివారం నుంచి బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతం అందించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
Also Read: Revanth’s Record: అప్పుల్లో రేవంత్ సర్కార్ రికార్డ్.. రెండు వారాల్లోనే రూ.12,500 కోట్ల రుణం!
