Tirumala: టీటీడీ నిబంధనలను అతిక్రమిస్తూ బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ తిరుమలలో రీల్స్ చిత్రీకరించడం వివాదానికి దారితీసింది. శ్రీవారి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిరుమలలో రీల్స్, షార్ట్ వీడియోలు చేయడంపై టీటీడీ ఇప్పటికే స్పష్టమైన నిషేధం విధించింది. గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసిన ఉదాహరణలు ఉన్నాయి. అయినప్పటికీ కొందరు సోషల్ మీడియాలో ఫాలోవర్లు, లైకుల కోసం నిబంధనలను పట్టించుకోకుండా వీడియోలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్‌కు వెళ్లే మార్గం, అలాగే ఘాట్ రోడ్లలో సినిమా పాటకు రీల్స్ రూపొందించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై టీటీడీ కూడా సీరియస్‌గా స్పందించింది. నిబంధనలను ఉల్లంఘించిన గీతూ రాయల్ బృందంపై చర్యలు తీసుకునే దిశగా అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ వివాదంపై గీతూ రాయల్ ఒక వీడియో ద్వారా స్పందించారు. “అందరికీ గుడ్ న్యూస్… నాపై చర్యలు తీసుకుంటారట. అందరూ హ్యాపీగా ఉండండి. చిన్న విషయాన్ని పెద్దది చేసి వీడియోలు చేసినందుకు థ్యాంక్యూ సో మచ్. ఇప్పటికే నా జీవితంలో సగం పోయింది, ఇంక పోవడానికి ఏమీలేదు. మిగిలినదాన్ని కూడా మీరు తీసుకోండి. ప్రశాంతంగా ఉండండి” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.
