Promissory Note: డబ్బు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు ప్రామిసరీ నోటు (Promissory Note) రాయడం సాధారణ విషయం. అయితే దీనిపై సరైన అవగాహన లేకపోతే భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఒక హైకోర్టు అడ్వకేట్ ప్రామిసరీ నోటు రాసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు.
మొదటగా, ప్రామిసరీ నోటును అప్పు తీసుకునే వ్యక్తే తన సొంత చేతిరాతతో రాయడం చాలా ముఖ్యం. కేవలం సంతకం చేయడం సరిపోదు. ఇలా రాస్తే, తరువాత “నేను అప్పు తీసుకోలేదు” అని చెప్పే అవకాశం ఉండదు.
నోటులో అప్పు ఎందుకు తీసుకుంటున్నారో స్పష్టంగా పేర్కొనాలి. ఉదాహరణకు “కుటుంబ ఖర్చుల కోసం” లేదా “పిల్లల చదువుల కోసం” అని రాయాలి. ఈ విధంగా కారణం ఉంటే, అప్పు తీసుకున్న వ్యక్తి మరణించినా, అతని వారసులు ఆ అప్పు చెల్లించాల్సిన బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ప్రామిసరీ నోటుకు మూడు సంవత్సరాల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. నోటుపై ఉన్న తేదీ నుంచి మూడు సంవత్సరాలు పూర్తయ్యాక అది చట్టపరంగా చెల్లదు. కాబట్టి ఆ గడువు లోపే అప్పు తీర్చడం లేదా నోటును రీన్యువల్ చేసుకోవడం అవసరం.
అలాగే, ఒక రూపాయి రెవెన్యూ స్టాంప్‌ను నోటుపై అంటించి, దానిపై అప్పు తీసుకున్న వ్యక్తి అడ్డంగా (cross) సంతకం చేయాలి. స్టాంప్ లేకపోతే లేదా దానిపై సంతకం లేకపోతే, ఆ నోటుకు కోర్టులో విలువ ఉండదు.
ఇంకా, ప్రామిసరీ నోటుపై ఇద్దరు సాక్షుల సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. అప్పు ఇచ్చేటప్పుడు సాక్షులు సమక్షంలో ఉంటే, ఆ నోటుకు చట్టబద్ధమైన బలం పెరుగుతుంది.
ముఖ్యంగా, అప్పు తీసుకునే వ్యక్తి ఎప్పుడూ ఖాళీ నోటుపై సంతకం చేయకూడదు. మొత్తం వివరాలు, తేదీ, తీసుకున్న మొత్తం అన్నీ పూర్తిగా రాసిన తర్వాతే సంతకం చేయాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తే, అప్పు ఇచ్చేవారికి రక్షణ లభిస్తుంది. అలాగే అప్పు తీసుకునేవారు కూడా మోసాలకు గురికాకుండా సురక్షితంగా ఉంటారు.
Also Read: Mangli: తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం.. కంటతడి పెట్టిన మంగ్లీ
Promissory Note: ప్రామిసరీ నోటుపై ఇది రాయకపోతే.. మీ డబ్బు వాపస్ రావడం కష్టమే
