Gold Price: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమవడం, హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిణామాలతో ఒకవైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా, మరోవైపు బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పడిపోతున్నాయి.
సాధారణంగా యుద్ధ పరిస్థితుల్లో బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల ధరలు పెరుగుతాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మార్కెట్లో డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే డాలర్ వైపు మళ్లుతున్నారు. దీని ప్రభావంగా ఈ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం దాదాపు 10 శాతం, వెండి 20 శాతం కంటే ఎక్కువ విలువ కోల్పోయాయి.
ఇంకా, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చు, మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ భయం కూడా బంగారం, వెండి ధరలపై ఒత్తిడిని పెంచుతోంది.
ఇక భారతీయ మార్కెట్లలో కూడా ఇదే ప్రభావం కనిపించింది. సోమవారం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.796 తగ్గి రూ.1,51,856కి చేరింది. వెండి ధరలు కూడా భారీగా పడిపోయి కిలోకు రూ.4,334 తగ్గి రూ.2,40,766 వద్ద నిలిచాయి. స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం రూ.1,52,130గా ఉండగా, కిలో వెండి రూ.2,39,230కి తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,720.09 డాలర్లకు పడిపోయింది. వెండి ధర కూడా ఔన్సుకు 74.4 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గే వరకు మార్కెట్లలో ఈ అనిశ్చితి కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. చమురు ధరల పెరుగుదల వల్ల సామాన్యుడిపై భారం పెరగడమే కాకుండా, బులియన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినవారికి కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read: Inter Results: ఇంటర్ ఫలితాలు.. 1000కి 997 మార్కులు
Gold Price: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
