Sanju Samson: ఓటమిని ఓప్పుకోని యోధుడు ❤️‘సన్’జూ!

A warrior who does not tolerate defeat ❤️‘San’ju’!

A warrior who does not tolerate defeat ❤️‘San’ju’!

Sanju Samson: సంజూ శాంసన్ పేరు ఇప్పుడు సహనం, పట్టుదల, చివరికి విజయానికి ప్రతీకగా నిలిచింది. ఒక దశలో వరుస వైఫల్యాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ఆటగాడు, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అతని విజయ కథలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మార్గదర్శకత కీలక పాత్ర పోషించిందని సంజూ స్వయంగా వెల్లడించాడు.

టోర్నమెంట్ ప్రారంభానికి ముందు సంజూ పరిస్థితి అంత అనుకూలంగా లేదు. జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో అతను ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో జట్టులో చోటు దక్కినా ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం రాలేదు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత కూడా అతను ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఆ సమయంలో చాలా మంది అతని కెరీర్ ముగిసిపోయిందని భావించారు.

అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యంతో బాధపడటంతో సంజూకు జట్టులో అవకాశం వచ్చింది. తర్వాత అభిషేక్ తిరిగి ఫిట్ అయినా, భారత జట్టు టాప్ ఆర్డర్‌లో ఎక్కువగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో కాంబినేషన్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లకు ఇబ్బంది పడుతున్న జట్టుకు మార్పులు అవసరమయ్యాయి. ఈ సమయంలో చెన్నైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సంజూ మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో అతను మంచి ఫామ్‌లోకి వస్తున్న సంకేతాలు ఇచ్చాడు.

అసలైన మలుపు వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కనిపించింది. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో సంజూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌ను విజయానికి చేర్చాడు. ఒత్తిడిలో ఆడిన ఈ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ తరహాలో ఉందని క్రికెట్ అభిమానులు ప్రశంసించారు.

సెమీఫైనల్‌లో కూడా సంజూ అదే జోరు కొనసాగించాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో 89 పరుగులు చేసి భారత్ 253 పరుగుల భారీ స్కోరు చేయడానికి సహకరించాడు. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో కూడా అతను మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 46 బంతుల్లో 89 పరుగులు చేసి భారత్‌ను 255 పరుగుల భారీ స్కోరు దిశగా నడిపించాడు.

ఈ టోర్నమెంట్‌లో సంజూ మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో 321 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తం టోర్నమెంట్‌లో కూడా మూడో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.

ఈ అవార్డు అందుకున్న తర్వాత సంజూ తన విజయానికి వెనుక ఉన్న కారణాలను వెల్లడించాడు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పాడు.

“నేను ఎప్పుడూ సచిన్ సర్‌తో సంప్రదింపులోనే ఉండేవాడిని. ఒకసారి ఆస్ట్రేలియాలో జట్టులో చోటు దక్కక బయట కూర్చున్నప్పుడు నాకు ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాలేదు. అప్పుడు నేను సర్‌ను సంప్రదించి చాలా సేపు మాట్లాడాను. నిన్న కూడా ఆయన ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగారు. ఆయనలాంటి గొప్ప ఆటగాడి నుంచి మార్గదర్శకత పొందడం నా అదృష్టం. ఆటపై స్పష్టత, పరిస్థితిని అర్థం చేసుకోవడం వంటి విషయాల్లో ఆయన సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి” అని సంజూ శాంసన్ వెల్లడించాడు.

Also Read: Suryakumar Yadav: రిటైర్మెంట్‌పై సూర్య ఇంట్రస్టింగ్ కామెంట్స్

Sanju Samson: ఓటమిని ఓప్పుకోని యోధుడు ❤️‘సన్’జూ!