Gas Cylinder Price: భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

Domestic LPG Price Hiked By Rs 60, Commercial Cylinder Up Rs 115 From Today

Domestic LPG Price Hiked By Rs 60, Commercial Cylinder Up Rs 115 From Today

Gas Cylinder Price: ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సామాన్య ప్రజలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో అనిశ్చితి పెరిగింది. ఈ పరిస్థితుల ప్రభావం భారతదేశంలో కూడా కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి ఈ ధరల పెంపును ప్రకటించడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన తాజా ధరల ప్రకారం గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.60 పెంపు జరిగింది. అలాగే వ్యాపార అవసరాలకు ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.115 పెంచారు. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో హైదరాబాద్‌లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.905 నుంచి రూ.965కు పెరిగింది. ఇక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1961 నుంచి రూ.2076కు చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి, సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉండటమే ఈ ధరల పెంపుకు ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు.

ఇక భవిష్యత్తులో గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు కూడా చేపట్టింది. దేశంలోని చమురు రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను ముందుగా దేశీయ అవసరాలకు మళ్లించాలని, ఆ తర్వాతే ఇతర వాణిజ్య అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. రిఫైనరీలు ఉత్పత్తి చేసే ఎల్పీజీని కేవలం మూడు ప్రభుత్వ చమురు సంస్థలకు — ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) — మాత్రమే విక్రయించాలని సూచించింది. అలాగే ఎల్పీజీ తయారీలో ఉపయోగించే ప్రొపేన్, బ్యూటేన్ వాయువులను పెట్రోకెమికల్ పరిశ్రమలకు మళ్లించకుండా, వంట గ్యాస్ తయారీకి మాత్రమే వినియోగించాలని ఆదేశించింది.

అంతేకాకుండా అంతర్జాతీయంగా కీలకమైన చమురు రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో సమస్యలు తలెత్తినా సరఫరా అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇతర దేశాల నుంచి చమురు దిగుమతులను పెంచే చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతోంది.

ఇక ధరలు పెరిగినా దేశంలో ప్రస్తుతం గ్యాస్, చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయని, ఫిబ్రవరిలో అవి సుమారు 20 శాతానికి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో సరఫరాలో పెద్దగా సమస్యలు ఉండవని అంటున్నారు.

అదేవిధంగా ఎంఆర్‌పీఎల్ రిఫైనరీ మూతపడిందని వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడ ఉత్పత్తి సాధారణంగానే కొనసాగుతోందని తెలిపింది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఎనర్జీ మార్కెట్‌లో ధరల మార్పులు సహజమని, అయితే ప్రజలకు వంట గ్యాస్ అందకుండా పోయే పరిస్థితి రాదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

Also Read: Summer: ‘రాబోయే మూడు రోజులు బయటికి రావొద్దు’

Gas Cylinder Price: భారీగా పెరిగిన సిలిండర్ ధరలు