Anasuya: ‘ఆంటీ’ అంటూ ట్రోల్స్.. ఇచ్చిపడేసిన అనసూయ!

Anasuya Bharadwaj Hits Back At Trolls Calling Her 'Aunty'

Anasuya Bharadwaj Hits Back At Trolls Calling Her 'Aunty'

Anasuya: ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఆమె చేసిన ఒక పోస్ట్ నెట్టింట విస్తృతంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా హోలీ వేడుకల సమయంలో జరిగిన ఒక ఘటన తర్వాత అనసూయ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

ఇటీవల జరిగిన హోలీ సంబరాల్లో అనసూయ పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ఆమెను ‘ఆంటీ’ అని సంబోధిస్తూ కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో ఆధారంగా కొందరు రీల్స్ చేసి, హేళన చేస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ వ్యవహారం అనసూయను తీవ్రంగా కలచివేసింది.

ఈ నేపథ్యంలో అనసూయ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. వయసును ఆధారంగా చేసుకుని మహిళలను హేళన చేయడం అసలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. సమాజంలో ఇతరుల బాధను చూసి వినోదం పొందే సంస్కృతి పెరుగుతుండటం చాలా ప్రమాదకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేసే వారిని వదిలేసి.. ఆ తప్పును ఎదిరించే వ్యక్తినే టార్గెట్ చేయడం సరైంది కాదని కూడా ఆమె పేర్కొన్నారు.

తనపై వస్తున్న విమర్శల గురించి అనసూయ మాట్లాడుతూ.. తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎప్పుడూ వెనకడుగు వేయనని చెప్పారు. తన ప్రయాణం, ఇప్పటి వరకు సాధించిన విజయాలు తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. ఎన్నో కష్టాలు, విమర్శలు ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకున్నానని, ట్రోల్స్ వల్ల తన ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గదని స్పష్టం చేశారు.

అలాగే సమాజంలో ‘నాకెందుకులే’ అనే ధోరణి పెరగడం వల్లే ట్రోలింగ్ ఎక్కువ అవుతోందని అనసూయ అభిప్రాయపడ్డారు. బాధ్యత గల పౌరులుగా ఇలాంటి సంస్కృతిని అందరూ ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. అపహాస్యాలకు భయపడకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, వృత్తిపరంగా ముందుకు సాగడమే తన లక్ష్యమని ఆమె తెలిపారు.

ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెకు మద్దతుగా చాలామంది నెటిజన్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Also Read: India: ‘మార్చి 21న పాక్‌పై ఇండియా దాడి చేస్తుంది’

Anasuya: ‘ఆంటీ’ అంటూ ట్రోల్స్.. ఇచ్చిపడేసిన అనసూయ!