Egg Dosa: ఎగ్ దోశ.. ఇలా చేస్తే హోటల్​లో మాదిరి క్రిస్పీగా, భలే టేస్టీగా!

How to Make a Delicious Egg Dosa at Home!

How to Make a Delicious Egg Dosa at Home!

Egg Dosa: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కరకరలాడే దోశలు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. పల్లీ చట్నీతో కలిసి వేడివేడిగా దోశ తింటే ఆ రుచి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఎగ్ దోశ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అందుకే చాలామంది ఇంట్లోనే ఎగ్ దోశ తయారు చేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ చాలా సార్లు హోటల్‌లలో దొరికేలా క్రిస్పీగా లేదా రుచిగా రావడం లేదని అనిపిస్తుంది. అలాంటి వారు పిండిని తయారు చేసే సమయంలో ఒక చిన్న టిప్ పాటిస్తే హోటల్ స్టైల్‌లోనే కరకరలాడే ఎగ్ దోశలను సులభంగా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

  • మినపప్పు – 1 కప్పు

  • ఇడ్లీ రైస్ – 2 కప్పులు

  • శనగపప్పు – 1 టేబుల్ స్పూన్

  • మెంతులు – 1 టీ స్పూన్

  • బొంబాయి రవ్వ – 1 టేబుల్ స్పూన్

  • పంచదార – 1 టీ స్పూన్

  • బటర్ – 1 టేబుల్ స్పూన్

కారం పొడి కోసం :

  • కారం – 2 టీ స్పూన్లు

  • ధనియాల పొడి – 1 టీ స్పూన్

  • జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్

  • చాట్ మసాలా – ½ టీ స్పూన్

  • పెరిపెరి పౌడర్ – 1 టీ స్పూన్ (ఐచ్చికం)

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, ఇడ్లీ రైస్, శనగపప్పు, మెంతులు వేసి బాగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని నాలుగు నుంచి ఐదు గంటలపాటు నానబెట్టాలి. మిశ్రమం బాగా నానిన తర్వాత నీటిని వడకట్టి, మిక్సీ జార్‌లో వేసి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలిపి మూతపెట్టి 8 నుంచి 10 గంటలపాటు పులియబెట్టాలి. పిండి బాగా పులిసిన తర్వాత దోశలు వేసుకునే ముందు మరోసారి బాగా కలపాలి. అవసరమైనంత పిండిని మాత్రమే ఒక బౌల్‌లోకి తీసుకుని, మిగిలిన పిండిని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు.

ఇప్పుడు తీసుకున్న పిండిలో బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ పంచదార వేసి కొద్దిగా నీరు కలిపి దోశకు సరిపడే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి.

తర్వాత కారం మిశ్రమం తయారు చేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పెరిపెరి పౌడర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.

ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి వేడిచేయాలి. పెనం వేడయ్యాక కొద్దిగా నూనె వేసి మొత్తం అప్లై చేయాలి. తరువాత పిండిని ఒక గరిటె వేసి దోశలా చల్లాలి. దానిపై బటర్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును చల్లాలి. తర్వాత ముందుగా తయారు చేసిన కారం మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ వేసి దోశపై సమంగా చల్లాలి.

అదే సమయంలో ఒక కోడిగుడ్డు పగలగొట్టి దోశపై పోసి గరిటెతో సమంగా పూయాలి. కొద్దిగా నూనె వేసి ఒక వైపు బాగా కాలనివ్వాలి. తరువాత మరో వైపు తిప్పి లో ఫ్లేమ్‌లో నిదానంగా కాల్చాలి. రెండు వైపులా బాగా కాలిన తర్వాత మడతపెట్టి ప్లేట్‌లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేయాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్పీ ఎగ్ దోశ రెడీ అవుతుంది.

పర్ఫెక్ట్ ఎగ్ దోశ కోసం టిప్స్

ఎగ్ దోశ మరింత క్రిస్పీగా రావాలంటే పిండిని పులియబెట్టిన తర్వాత దోశ వేసే ముందు కొద్దిగా బొంబాయి రవ్వ కలపాలి. అలాగే కొద్దిగా పంచదార వేస్తే దోశకు మంచి కలర్ వస్తుంది. సాధ్యమైనంతవరకు ముందురోజే పిండిని రుబ్బుకుని పులియబెట్టుకుంటే ఉదయం దోశలు మరింత రుచిగా, కరకరలాడేలా తయారవుతాయి.

ఇడ్లీ రైస్ సూపర్ మార్కెట్లలో సులభంగా దొరుకుతుంది. అది అందుబాటులో లేకపోతే సాధారణ బియ్యంతో కూడా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఇంట్లోనే హోటల్ స్టైల్ ఎగ్ దోశను సులభంగా తయారు చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆస్వాదించవచ్చు.

Also Read: Whatsapp: వాట్సాప్‌లో 20 చాట్స్ వరకు పిన్ చేయొచ్చు!

Egg Dosa: ఎగ్ దోశ.. ఇలా చేస్తే హోటల్​లో మాదిరి క్రిస్పీగా, భలే టేస్టీగా!