Friendship Breakups: ప్రేమలో ఓడిపోవడం వల్ల కలిగే బాధ మాటల్లో చెప్పలేం. ఆ విషయం చుట్టుపక్కల వాళ్లు కూడా ఈజీగానే అర్థం చేసుకుంటారు. స్నేహితులు ఓదారుస్తారు, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలుస్తారు. కానీ అంతకన్నా హర్ట్ చేసే విషయం ఫ్రెండ్షిప్ బ్రేక్(Friendship Breakups) కావడం. ఎందుకంటే స్నేహితులు విడిపోయినపుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండదు.
ఓ సన్నిహితుడిని కోల్పోవడం అంటే ఒక వ్యక్తి మన జీవితంలో నుంచి దూరం కావడం మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్లుగా కలిసి పంచుకున్న జ్ఞాపకాలు, అనుభవాలు, రహస్యాలు, నవ్వులు, బాధలు కూడా ఒక్కసారిగా గతంగా మారిపోతాయి. ముఖ్యంగా మన జీవితంలోని ఎన్నో ముఖ్యమైన సంఘటనలకు సాక్షిగా నిలిచిన వ్యక్తి దూరమైతే ఆ లోటు దేహం మొత్తాన్ని దహిస్తుంది.

మనతో ఉండే స్నేహితుల వల్ల మన వ్యక్తిత్వం కూడా మారే అవకాశం ఉంటుంది. వారి ప్రభావం మనపై చాలా ఉంటుంది. స్నేహితుడిగా పరిచయమైనపుడు సాధారణంగానే అనిపించినా.. కాలక్రమేణా వాళ్లే ధైర్యం చెప్పే వ్యక్తిగా, నవ్వించే వ్యక్తిగా.. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తిగా మారొచ్చు. అలా వాళ్లే మనకు ప్రాణంగా మారతారు. అలాంటి వ్యక్తి మన జీవితంలో నుంచి వెళ్లిపోయినపుడు.. కలిగే బాధ వర్ణణాతీతం. అందుకే స్నేహం కోల్పోయిన తర్వాత కొందరికి తాము ఎందుకు ఇంత బాధపడుతున్నామో అర్థం కాక గందరగోళంగా అనిపిస్తుంది.
వాళ్లతో గడిపిన రోజులు, ప్రదేశాలు.. అన్నీ గుర్తొచ్చినప్పుడల్లా కలిగే ఆవేదన ఎంత చెప్పినా ఎవరికీ అర్థం కాదు. తాము వాళ్లతో ఉన్నపుడు ఎలా ఉన్నారో, ఇప్పుడెలా ఉన్నారో తలచుకున్నప్పుడల్లా కొన్నిసార్లు ఏడవడం కూడా తక్కువే అవుతుంది. లవ్ బ్రేక్ అయిననప్పుడు మళ్లీ మునుపటిలా మారేందుకు సమయం తీసుకోవడం సహజమేనని సమాజం అంగీకరిస్తుంది. కానీ స్నేహం విషయంలో మాత్రం త్వరగా మర్చిపోవాలని అనుకోవచ్చు. కానీ ఇది ఆ బాధను మరింత ఒంటరిగా అనిపించేలా చేస్తుంది.
నిజానికి.. సన్నిహిత స్నేహం కూడా ఒక ముఖ్యమైన బంధమే. అది ముగిసినప్పుడు బాధపడటం, ఆ వ్యక్తిని మిస్ అవ్వడం, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం సహజమే. ఆ నష్టాన్ని చిన్నదిగా భావించాల్సిన అవసరం లేదు. స్నేహం ముగిసిందనే విషయాన్ని అంగీకరించడం, ఆ బాధను అనుభవించేందుకు మనకు మనమే సమయం ఇవ్వడం.. కోలుకునే ప్రక్రియలో మొదటి అడుగులా భావించి ముందుకు సాగాలి.
Also Read: Samantha: రూ.1.16 లక్షల చీర, బ్లౌజ్లో సమంత.. ఈ లుక్ వెనుక ఇంత కథ ఉందా?
