Revanth’s Record: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రుణాలపైనే ఆధారపడి బండి లాగిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత ఆదాయాన్ని పెంచుకోవడంలో చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం, రికార్డు స్థాయిలో అప్పులు చేయడంలో మాత్రం మొదటి స్థానంలో నిలిచింది.
తాజా గణాంకాల ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఆర్‌బీఐ నుంచి ఏకంగా ₹12,500 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం ఆర్‌బీఐ నుంచే దాదాపు ₹1 లక్ష కోట్ల వరకు అప్పులు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్), కోవిడ్ మహమ్మారి వంటి అత్యంత విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మునుపటి ప్రభుత్వం ఈ స్థాయిలో భారీగా రుణాలు తీసుకోలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రికార్డు స్థాయి అప్పులకు తెరలేపింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఇప్పటివరకు రేవంత్ సర్కార్ ₹31,400 కోట్ల భారీ రుణాన్ని సేకరించింది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన మొత్తం రుణాల పరిమితిలో.. కేవలం సగం కాలంలోనే 50 శాతం అప్పులను ప్రభుత్వం ఇప్పటికే వాడేసింది. గత ఏడాది ప్రభుత్వం ₹54,009 కోట్ల రుణాలు తీసుకోవాలని ప్రతిపాదించగా, అంచనాలను మించి ఏకంగా ₹85,840 కోట్ల అప్పులు చేసింది. ఈ ఏడాది కూడా బడ్జెట్ అంచనాలకు మించి రుణాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఇంత భారీ స్థాయిలో నిధులు అప్పుల రూపంలో తెస్తున్నప్పటికీ.. అటు అభివృద్ధి పనుల్లో, ఇటు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి.
Also Read: Viral: ప్రాణాల కంటే కొడుకు చదువే ముఖ్యం.. భీకర వరదల్లో తండ్రి చేసిన సాహసం చూస్తే కన్నీళ్లు ఆగవు!
