Ketan Agarwal Case: పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఒక యువ వ్యాపారవేత్త, కాబోయే భార్య చేతిలోనే దారుణ హత్యకు గురైన ఉదంతం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన ప్రముఖ స్థిరాస్తి (Real Estate) సంస్థ డైరెక్టర్ కేతన్ అగర్వాల్ (Ketan Agarwal )(26) ఈ నెల 18న లోహగఢ్ కోట వద్ద 350 అడుగుల లోతు లోయలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఇది ప్రమాదం కాదని, అతని కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌధరి (22) కలిసి చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించి, వారిద్దరినీ అరెస్ట్ చేశారు.
రూ. 17 కోట్ల రాయల్ వెడ్డింగ్.. కానీ,
కేతన్ అగర్వాల్ విదేశాల్లో పీజీ పూర్తి చేసి వచ్చి, తన తండ్రి విశాల్ అగర్వాల్‌తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. కేతన్కు సియా గోయల్ (Siya Agarwal)తో ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్(Udaipur) (కొన్ని నివేదికల ప్రకారం జైపూర్) ప్యాలెస్‌లో రూ. 17 కోట్లు ఖర్చు చేసి అట్టహాసంగా పెళ్లి చేయడానికి ఇరుకుటుంబాలు ఏర్పాట్లు చేశాయి. అతిథుల కోసం రెండు ప్రత్యేక విమానాలను కూడా బుక్ చేశారు.
అయితే, సియాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆమె గత ఏడాది కాలంగా చేతన్ చౌధరి అనే యువకుడితో ప్రేమలో ఉంది. కుటుంబ సభ్యుల ఒత్తిడి తట్టుకోలేక కేతన్‌తో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ, అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని తన ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
మొదటి నుంచీ కుట్రలు.. క్యాన్సిల్ అయిన బాలి ట్రిప్
పోలీసుల విచారణలో సియా, చేతన్‌లు కేతన్‌ను చంపేందుకు అంతకుముందు కూడా ప్రయత్నించినట్లు తెలిసింది.
-
పాస్‌పోర్ట్ డ్రామా: కేతన్, సియాలు పెళ్లికి ముందు ‘బాలి’ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నారు. అంతా సిద్ధమయ్యాక, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారిలో ఒక హోటల్ వాష్‌రూమ్‌లో సియా తన పాస్‌పోర్ట్‌ను చింపి పారేసింది. ఆ తర్వాత పాస్‌పోర్ట్ పోయిందంటూ డ్రామా ఆడి బాలి ట్రిప్ క్యాన్సిల్ చేయించింది.
-
పాము భయం నెపంతో..: జూన్ 14న కూడా కేతన్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి, పాము వచ్చిందనే భయాన్ని సృష్టించి లోయలోకి నెట్టాలని చూశారు. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు.

పుట్టినరోజు వేడుక పేరుతో డెత్ ట్రాప్
జూన్ 19న సియా పుట్టినరోజు. దీనికోసం మహాబలేశ్వర్(Mahhabaleshwar)లోని లగ్జరీ రిసార్ట్‌లో కేతన్ కుటుంబం 40 రూములు బుక్ చేసింది. అయితే జూన్ 18న, సియా తన బర్త్‌డే వేడుకలకు ముందే లోహగఢ్ కోటలో ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ లేదా ట్రెక్కింగ్ చేద్దామని కేతన్‌ను బలవంతం చేసి తీసుకెళ్లింది.
వారు కోట పైకి వెళ్లేసరికే, ప్రియుడు చేతన్ చౌధరి ముఖానికి హుడీ (టోపీ) ధరించి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో కూడా అతను హుడీ ధరించడం కోటలోని సీసీటీవీల్లో రికార్డయ్యింది. కేతన్ లోయ అంచున నిలబడి ఫోటోలకు పోజులిస్తున్న సమయంలో, వెనుక నుంచి వచ్చిన సియా, చేతన్‌లు అతడిని బలంగా లోయలోకి తోసేశారు.
పోలీసులకు దొరికిపోయింది ఇలా..
కేతన్ కింద పడిపోయాక, సియా పెద్దగా కేకలు వేస్తూ.. హోరుగాలి వల్ల కేతన్ పట్టుతప్పి పడిపోయాడంటూ నాటకమాడింది. మరుసటి రోజు (తన పుట్టినరోజున) సోషల్ మీడియాలో కేతన్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేసి ఎమోషనల్ మెసేజ్ పెట్టి అందరి సానుభూతి పొందే ప్రయత్నం చేసింది.
అయితే, కేతన్ మంచి ట్రెక్కర్ అని, అంత తేలిగ్గా పడిపోయే అవకాశం లేదని అతని తండ్రి పోలీసులకు అనుమానం వ్యక్తం చేశారు. పుణె రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి, సియా మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి సియా, చేతన్ ఇద్దరూ తలవంచక తప్పలేదు. తామే కేతన్‌ను తోసి చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరిద్దరిపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 103 (హత్య), 61 (క్రిమినల్ కాన్స్పిరసీ) కింద కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.
Also Read: Maa Inti Bangaram: సమంత ప్లేస్‌లో సాయి పల్లవి.. క్రేజీగా ఉండేదా?
