NEET: నీట్ మిస్.. గుండెలు పగిలేలా ఏడ్చిన తండ్రి

neet-exam two minutes late father breakdown

NEET: జాతీయ అర్హత పరీక్ష ‘నీట్’ (NEET) రాసే విద్యార్థుల జీవితాలతో నిమిషాల కాలం ఎంతటి చెలగాటం ఆడుతుందో చెప్పడానికి మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లోని విదిషలో జరిగిన ఒక ఘటనే నిదర్శనం. కేవలం 2 నిమిషాల ఆలస్యం కారణంగా ఒక విద్యార్థిని ఏడాది కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది.

అసలేం జరిగిందంటే?

కుర్వాయి ప్రాంతానికి చెందిన రాగిణి విశ్వకర్మ (Ragini Viswa Karma) అనే విద్యార్థిని తన తండ్రి ఉమేష్ సింగ్ విశ్వకర్మతో కలిసి బైక్‌పై దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించి విదిషలోని రీ-నీట్ పరీక్షా కేంద్రానికి బయలుదేరింది. అయితే, దారిలో భారీ వర్షం పడటం, అలాగే బైక్ పంక్చర్ అవ్వడంతో వారు తీవ్రంగా ఆలస్యమయ్యారు. పరీక్షా కేంద్రానికి ఎంట్రీ ముగిసే సమయం మధ్యాహ్నం 1:30 గంటలు కాగా, ఆ అమ్మాయి 1:32 గంటలకు (కేవలం 2 నిమిషాలు లేట్‌గా) సెంటర్‌కు చేరుకుంది.

Also Read: Accident: అద్దె ఇంట్లోకి రానివ్వని యజమాని.. రోడ్డుపైనే ముగ్గురి శవాలు!

గేటు ముందే కుప్పకూలిన తండ్రి!

నిబంధనల ప్రకారం సమయం దాటిపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది గేటు తీయడానికి నిరాకరించారు. దాంతో ఆ తండ్రి అధికారుల కాళ్లవేళ్లపడి బ్రతిమిలాడారు, గేటుకు తలబాదుకుంటూ గుండెలు పగిలేలా ఏడ్చేశారు. తండ్రీకూతుళ్లు ఇద్దరూ రోడ్డుపైనే ఏడుస్తున్న దృశ్యాలు అక్కడ ఉన్నవారిని కదిలించాయి.

లోపలికి పంపినా దక్కని ఫలితం

అక్కడ ఉన్న స్థానికులు, పోలీసులు అభ్యర్థించడంతో చివరకు నోడల్ అధికారి (కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్) స్పందించి ఆ బాలికను పరీక్షా కేంద్రం లోపలికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే గూగుల్/NTA సర్వర్‌లో ఎంట్రీ టైమ్ ముగిసిపోవడంతో ‘సిస్టమ్’ ఆటోమేటిక్‌గా లాక్ అయిపోయింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తీసుకోకపోవడంతో ఆ విద్యార్థిని పరీక్ష రాయకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.

ఇదే కేంద్రం వద్ద మరో విద్యార్థిని పాత అడ్మిట్ కార్డు తీసుకురావడంతో సాంకేతిక కారణాల వల్ల ఆమెకు కూడా నిరాశే ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “నిబంధనలు ముఖ్యమే కానీ, విద్యార్థుల భవిష్యత్తును బలితీసుకునేలా నిమిషాల లెక్కలు ఉండకూడదు” అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Apple: ఐఫోన్లు ఔటాఫ్ స్టాక్.. కారణమిదే!