Nails and Hair Cut: మనలో చాలా మంది గోర్లు, జుట్టు లేదా గడ్డం పెరిగిన వెంటనే కత్తిరించుకోవడం అలవాటుగా చేసుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పనులను ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయం, రోజు పాటించకపోతే గ్రహాల అశుభ ప్రభావం పడే అవకాశం ఉందని, దాంతో ఆర్థిక సమస్యలు లేదా అనారోగ్య సమస్యలు రావచ్చని వారు పేర్కొంటున్నారు. అందుకే ఏ రోజుల్లో జుట్టు, గోర్లు కత్తిరించుకోవాలి, షేవింగ్ ఎప్పుడు చేయాలి అనే విషయాలను తెలుసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
శాస్త్రాల ప్రకారం, జుట్టు కత్తిరించుకోవడానికి ఉత్తమ సమయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య. అలాగే సోదరులు ఒకే రోజున హెయిర్ కట్ చేయించుకోవడం మంచిది కాదని చెబుతారు. సోమవారం జుట్టు కత్తిరించుకుంటే ఆదాయం పెరుగుతుందని నమ్మకం ఉంది. కానీ సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు లేదా ఒక్కరే కొడుకు ఉన్నవారు సోమవారం ఈ పని చేయకూడదని అంటారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు రావచ్చని విశ్వసిస్తారు.
మంగళవారం అంగారక గ్రహానికి, అలాగే ఆంజనేయుడికి సంబంధించిన రోజు. ఈ రోజున జుట్టు, గోర్లు కత్తిరించడం వల్ల కోపం పెరగడం, ఆయుష్షు తగ్గడం వంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
బుధవారం మాత్రం శుభదాయకంగా భావిస్తారు. ఈ రోజున జుట్టు, గోర్లు, గడ్డం కత్తిరించుకోవడం వల్ల లక్ష్మీదేవి కృప లభిస్తుందని, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని అంటారు. బుధుడి అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, ఆదాయం కూడా పెరుగుతుందని విశ్వసిస్తారు.
గురువారం బృహస్పతి గ్రహానికి సంబంధించిన రోజు కావడంతో ఈ రోజున జుట్టు, గోర్లు కత్తిరించడం మంచిది కాదని చెబుతారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుందని, గురుడి ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తారు.
శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైన రోజు. ఈ రోజున జుట్టు, గోర్లు కత్తిరించుకుంటే శుభఫలితాలు వస్తాయని, జీవితంలో విజయావకాశాలు పెరుగుతాయని నమ్మకం ఉంది. ఆదాయం, కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయని అంటారు.
శనివారం ఈ పనులు చేయడం మంచిది కాదని భావిస్తారు. ఈ రోజున జుట్టు, గోర్లు కత్తిరిస్తే ఆర్థిక నష్టాలు, అనూహ్య సమస్యలు ఎదురయ్యే అవకాశముందని చెబుతారు. అంతేకాదు పితృ దోషం కలిగే ప్రమాదం ఉందని కూడా విశ్వసిస్తారు.
ఆదివారం సూర్య భగవానుడికి సంబంధించిన రోజు. ఈ రోజున చాలా మందికి సెలవు ఉండటం వల్ల హెయిర్ కట్ లేదా షేవింగ్ చేయించుకోవాలని అనుకుంటారు. అయితే ఈ రోజున ఈ పనులు చేస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని చెబుతారు.
అలాగే తిథుల ప్రకారం విధియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి రోజులు కటింగ్, షేవింగ్ చేసుకోవడానికి శుభప్రదంగా పరిగణించబడతాయి.
గమనిక: పై సమాచారం పూర్తిగా మత విశ్వాసాలపై ఆధారపడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
