Kalvakuntla Kavitha: పార్టీ పేరు ప్రకటించిన కవిత

Kalvakuntla Kavitha ANNOUNCED Party Name

Kalvakuntla Kavitha ANNOUNCED Party Name

Kalvakuntla Kavitha: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత శనివారం తన కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీకి “టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)” అని పేరు పెట్టారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో జరిగిన ఆవిర్భావ సభలో ఈ ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తాను కీలక పాత్ర పోషించానని గుర్తుచేశారు. సింగరేణిపై తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలను ఏకం చేసిన ఘనత జాగృతిదేనని, బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశామని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి జాగృతి బలమైన సాంస్కృతిక పునాది వేసిందని తెలిపారు.

అయితే, తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా ప్రజల ఆశలు పూర్తిగా నెరవేరలేదని ఆమె అన్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యం దారి తప్పిందని, ఆ రథచక్రం ఎక్కడో విరిగిపోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణను పాలించిన కుటుంబంలో తాను భాగమైనందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నానని, అయితే అదే కుటుంబం రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందనే గర్వం కూడా ఉందని చెప్పారు.

ఇసుక మాఫియా వంటి సమస్యలు గతంలో తీవ్రంగా పెరిగాయని, ఆ విషయాల్లో ప్రజలు తనను క్షమించాలని కోరారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఆశించిన ఫలితాలు రాలేదని, ఆ తప్పులను సరిదిద్దేందుకు ఈ కొత్త పార్టీతో ముందుకు వచ్చానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని విమర్శించారు.

ప్రజలకు మంచి చేయాలంటే రాజకీయ పార్టీ అవసరమని, తెలంగాణలోని మూడు కోట్ల మందికి తాను “అమ్మ”లా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజల కష్టాలు తల్లికి మాత్రమే బాగా అర్థమవుతాయని, అప్పుడు మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.

తెలంగాణలో ఉన్న ప్రధాన మూడు పార్టీలు అవినీతి, అధర్మం, బంధుప్రీతితో నిండిపోయాయని విమర్శించారు. ఎంతో మంది నాయకులు ఎన్నో వాగ్దానాలు చేసినా ప్రజలకు ప్రయోజనం కలగలేదని అన్నారు. ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ టీఆర్ఎస్ పార్టీ “పాంచజన్యం” మోగిస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం తామే ప్రధాన ప్రతిపక్షమని, వచ్చే రెండేళ్లలో అధికారంలోకి వస్తామని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా “పాంచజన్యం” పేరిట ఐదు ప్రధాన హామీలు ప్రకటించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అనే ఐదు రంగాల అభివృద్ధిపైనే తమ పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు.

Also Read: CIBIL Score: ఇక క్షణాల్లో సిబిల్​ స్కోర్ చెక్​ చేసుకోవచ్చు!

Kalvakuntla Kavitha: పార్టీ పేరు ప్రకటించిన కవిత