SSC Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 16తో ముగియనున్నాయి. పరీక్షలు పూర్తయ్యే సరికి ఫలితాలను త్వరగా విడుదల చేయాలని విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే ఇంటర్ ఫలితాల తేదీని ప్రకటించిన ప్రభుత్వం, పదో తరగతి ఫలితాలను కూడా పరీక్షలు ముగిసిన 20 రోజుల్లోనే ప్రకటించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఈ ఉద్దేశంతో పరీక్షలు జరుగుతుండగానే ఈ నెల 3వ తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటివరకు పూర్తైన సబ్జెక్టుల పేపర్లకు మార్కుల లెక్కింపు కొనసాగుతోంది.
పరీక్షలు 16వ తేదీతో పూర్తయ్యాక, మిగిలిన సబ్జెక్టుల మూల్యాంకనాన్ని వేగంగా పూర్తి చేసి ఈ నెల 23లోపు మొత్తం ప్రక్రియ ముగించాలని అధికారులు భావిస్తున్నారు. పేపర్ కరెక్షన్, మార్కుల నమోదు పనులు సమయానికి పూర్తైతే, వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే మే మొదటి వారంలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఫలితాలు కొద్దిగా ఆలస్యంగా వస్తున్నాయి. గతంలో ఏప్రిల్ 30న ఫలితాలు విడుదల కాగా, ఈసారి పరీక్షలే ఏప్రిల్ 16 వరకు కొనసాగుతున్నందున మూల్యాంకనానికి అదనపు సమయం పడుతోంది. దీంతో ఫలితాల విడుదల కూడా కొంత ఆలస్యం అవుతోంది.
