Monalisa Bhosle: మహా కుంభమేళాలో వైరల్ అయిన యువతి మోనాలిసా భోంస్లే ఇటీవల చేసిన వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా ఆమె ఫర్మాన్ ఖాన్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఈ వివాహం కేరళలో జరగగా, అక్కడి కొంతమంది రాజకీయ నాయకులు దగ్గరుండి ఈ పెళ్లిని నిర్వహించారని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా మోనాలిసా తండ్రి జయసింగ్ భోంస్లే స్పందించారు.
గత సంవత్సరం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో మోనాలిసా పూసలు అమ్ముతూ కనిపించింది. ఆమె తేనె కళ్లతో ఉన్న అందం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆమెకు వచ్చిన ఈ క్రేజ్‌ను చూసి పలువురు దర్శక నిర్మాతలు సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. అయితే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ మోనాలిసా ఇటీవల కేరళలో ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది.
కొంతమంది ఈ వివాహాన్ని ‘లవ్ జిహాద్’గా పేర్కొంటూ విమర్శలు చేయగా, మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ మాత్రం ఆ ఆరోపణలను ఖండించారు. తమకు అన్ని మతాలు సమానమని వారు స్పష్టం చేశారు.
ఈ విషయంపై మోనాలిసా తండ్రి జయసింగ్ భోంస్లే మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు తమ ఇంటికి వచ్చారని తెలిపారు. వారు మోనాలిసాకు నటనలో శిక్షణ ఇవ్వడంతో పాటు సినిమా అవకాశాల కోసం కేరళకు తీసుకెళ్లాలని కోరారని చెప్పారు. తాము పెద్దగా చదువుకోని వాళ్లమని, ఇలాంటి విషయాలపై ఎక్కువగా తెలియకపోవడంతో తాను అంగీకరించానని అన్నారు. అంతేకాకుండా మోనాలిసాతో కలిసి తాను కూడా కేరళకు వెళ్లానని చెప్పారు. ఆ సమయంలో మోనాలిసా ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ కూడా ఆ బృందంలో ఉన్నాడని తెలిపారు.
తర్వాత మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాలని చెప్పినప్పుడు తాను అభ్యంతరం తెలిపానని జయసింగ్ చెప్పారు. తమ సొంత ఊరికి తిరిగి రావాలని కూడా కోరానని వెల్లడించారు. కానీ వారు కేరళలోని ఒక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కోరారని తెలిపారు. మోనాలిసా ఇప్పటికే 18 సంవత్సరాలు పూర్తయినందున ఆమెకు తన ఇష్టానుసారం వివాహం చేసుకునే హక్కు ఉందని పోలీసులు చెప్పారని ఆయన తెలిపారు. అందుకే తాము ఏమీ చేయలేకపోయామని అన్నారు.
మోనాలిసా కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై స్పందించారు. “సినిమా అవకాశాల పేరుతో మా అమ్మాయిని కేరళకు పిలిపించారు. మేము పెద్దగా చదువుకోని వాళ్లం కాబట్టి ఏమి జరుగుతుందో పూర్తిగా అర్థం కాలేదు. బహుశా ఎవరైనా ఆమెను ప్రభావితం చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప మాకు వేరే మార్గం లేదు. ముందే చెప్పి ఉంటే మేమే పెళ్లి జరిపించేవాళ్లం” అని కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: Mann Pishach: సినిమా బడ్జెట్ జస్ట్ రూ.33వేలు.. సూపర్ ట్రైలర్
Monalisa Bhosle: ఏంటీ.. మత్తు ఇచ్చి మోనాలిసాను పెళ్లి చేసుకున్నాడా..??
