Telangana: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సమాఖ్యలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశం.
ఈ పెట్రోల్ పంపులను ఏరియా లెవల్ ఫెడరేషన్లు (ALF), టౌన్ లెవల్ ఫెడరేషన్లు (TLF) ద్వారా స్థాపించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒక పెట్రోల్ బంక్‌ను సంబంధిత జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దశలవారీగా అన్ని జిల్లాల్లో ఈ ప్రణాళిక అమలు చేయబడుతుంది.
తెలంగాణ మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (MEPMA) ఈ ప్రక్రియకు సంబంధించి సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత చమురు కంపెనీలతో సమన్వయం చేసుకుని ప్రధాన ప్రదేశాల్లో తగిన భూమిని గుర్తిస్తారు. భూమిని లీజుకు తీసుకునే ప్రతిపాదనలను మెప్మాకు సమర్పించాలి. లీజు కాలం సాధారణంగా 20 లేదా 30 సంవత్సరాలపాటు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఖర్చులను ఆయా చమురు కంపెనీలే భరిస్తాయి.
డీలర్‌షిప్ లైసెన్స్‌ను చమురు కంపెనీలు జారీ చేసినప్పటికీ, నిర్వహణ బాధ్యత ALF/TLFలదే ఉంటుంది. నిర్మాణం, ఇతర సన్నాహక పనులు కూడా చమురు కంపెనీలతో చర్చల ఆధారంగా చేపడతారు. వర్కింగ్ క్యాపిటల్‌ను జిల్లా కలెక్టర్ ఆమోదంతో సమీకరిస్తారు. కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందు తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) పొందాలి. మెప్మా సాంకేతిక, హ్యాండ్‌హోల్డింగ్ మద్దతు అందిస్తుంది.
సమాఖ్యలు ఉమ్మడి కరెంట్ బ్యాంక్ ఖాతా ప్రారంభించాలి. పాన్, వ్యాట్ రిజిస్ట్రేషన్లు పొందాలి. యజమాని పేరును “మెప్మా TLF ఫిల్లింగ్ స్టేషన్” లేదా “మెప్మా ALF ఫిల్లింగ్ స్టేషన్”గా నమోదు చేయాలి. ఇంధన పంపిణీ యంత్రాల స్టాంపింగ్, అమ్మకాల పర్యవేక్షణ కోసం ఆటోమేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. డిజిటల్, మాన్యువల్ రికార్డులు నిర్వహించడం తప్పనిసరి. ఇందుకు లీగల్ మెట్రాలజీ విభాగంతో సమన్వయం అవసరం.
ఈ పెట్రోల్ బంకుల్లో మేనేజర్లు, ఇంధన సహాయకులను స్వయం సహాయక బృందాల నుంచి ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక టీఎల్‌ఎఫ్, ఏఎల్ఎఫ్ తీర్మానాలతో, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జరుగుతుంది. ఇంధన కమిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని గౌరవ వేతనాలు, విద్యుత్ బిల్లులు, నిర్వహణ ఖర్చుల కోసం వినియోగించవచ్చు.
జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన కార్యనిర్వాహక కమిటీలు నెలకు రెండు సార్లు సమావేశమై కార్యకలాపాలను సమీక్షిస్తాయి. వర్కింగ్ క్యాపిటల్ తిరిగి చెల్లింపు, నికర లాభాల వినియోగం వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకుంటాయి.
Also Read: Holi: వింత ఆచారం.. చెప్పులతో కొట్టుకుంటూ హోలీ
Telangana: మహిళా పెట్రోల్ బంకులు రానున్నాయ్
