War Effect: రేపటి నుంచి ఆ సిలిండర్‌ సరఫరా నిలిపివేత

War effect on the temple city of Tirupati

War effect on the temple city of Tirupati

War Effect: అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న యుద్ధ పరిణామాల ప్రభావం ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై కూడా పడుతోంది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్తులో గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు గ్యాస్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి తిరుపతి నగరంలో 19.5 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేటు గ్యాస్ కంపెనీలు కలిసి నిర్ణయించాయి.

ఈ అకస్మాత్తు నిర్ణయం వ్యాపార వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. ముఖ్యంగా తిరుపతికి రోజూ వేలాదిగా వచ్చే భక్తులకు భోజన సదుపాయాలు కల్పించే హోటళ్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కమర్షియల్ కోటాను నియంత్రించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని గ్యాస్ కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు.

పర్యాటక, ఆధ్యాత్మిక రంగాలపై ఆధారపడిన తిరుపతి నగరంలో చిన్నపాటి తినుబండారాల బండ్ల నుంచి పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు సుమారు 3,000కు పైగా ఆహార విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఈ హోటళ్లు కలిపి నెలకు దాదాపు 40,000కు పైగా కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా సరఫరా ఆగిపోవడంతో హోటల్ యజమానులకు కార్యకలాపాలు కొనసాగించడం పెద్ద సవాలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

నగరంలో ఉన్న 15కు పైగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద కూడా స్టాక్ పరిమితంగానే ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో భక్తులకు అందుబాటు ధరలో దొరికే ఆహార పదార్థాల కొరత ఏర్పడటమే కాకుండా, ధరలు కూడా పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.

ఈ విషయం నగరంలో వేగంగా వ్యాపించడంతో గ్యాస్ బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. రేపటి నుంచి సరఫరా నిలిచిపోతుందనే భయంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకులు తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల వద్దకు చేరుకుని తమ ఖాళీ సిలిండర్లను నింపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక ప్రైవేటు గ్యాస్ కంపెనీలు కూడా ప్రభుత్వ సంస్థల మాదిరిగానే సరఫరాను నిలిపివేయాలని నిర్ణయించడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా దాదాపు లేకపోయాయి. యుద్ధ ప్రభావం భవిష్యత్తులో సాధారణ ప్రజల వంటగదులపై కూడా పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్థానికులు, భక్తులు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read: Alzheimer’s: ఒక్క పరీక్షతో ఈ వ్యాధిని ముందే గుర్తించొచ్చు!

War Effect: రేపటి నుంచి ఆ సిలిండర్‌ సరఫరా నిలిపివేత