Tragic Decision: కుటుంబంతో గోదావరిలో దూకిన ఏఈ.. అసలు కారణం ఇదేనా?

AE Jumps into Godavari with Family.. What Led to the Tragic Decision?

Tragic Decision: కాకినాడకు చెందిన పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ తిల్లపూడి నూకరాజు (61) కుటుంబంతో కలిసి గోదావరిలో దూకిన ఘటన రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం లభించగా.. ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే వారితో పాటు నదిలోకి దూకిన పదేళ్ల మనవడు రియాన్ష్‌ కార్తికేయ ఈదుకుంటూ బయటపడి ప్రాణాలతో బయటపడ్డాడు.

కాకినాడలోని అశోక్‌నగర్‌లో నివసించే నూకరాజు పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్‌ శాఖ ఏఈగా పనిచేస్తున్నారు. సుమారు పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆయన వచ్చే జనవరిలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఆదివారం రాత్రి భార్య, కుమార్తె, మనవడితో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. అనంతరం రైల్వే వంతెన వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు గోదావరిలో దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు.

  family jump into  Godavari river

విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, మత్స్యకారులు రంగంలోకి దిగి గాలింపు చేపట్టారు. నదిలో దూకిన తర్వాత కార్తికేయ దాదాపు 20 నిమిషాల పాటు ఈదుతూ సాయం కోసం కేకలు వేయగా.. మత్స్యకారులు గుర్తించి పడవలో ఒడ్డుకు తీసుకొచ్చారు. స్వల్ప గాయాలైన బాలుడికి చికిత్స అందించి బంధువులకు అప్పగించారు. సోమవారం సాయంత్రం నూకరాజు మృతదేహం దోబీఘాట్‌ వద్ద లభ్యమైంది.

కుటుంబం ఆత్మహత్యకు ముందు నూకరాజు రాసిన లేఖలో కాకినాడకు చెందిన రైఫిల్‌ షూటింగ్‌ నిర్వాహకుడు షేక్‌ సాధిక్‌ఖాన్‌పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన కుమార్తెను సాధిక్‌ వేధిస్తున్నాడని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని, బంగారం, డబ్బు, లాకర్‌ తాళాలు తీసుకున్నాడని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ వేధింపులు భరించలేక కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

గతంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో షూటింగ్‌ కోచ్‌గా పనిచేసిన సాధిక్‌ఖాన్‌పై విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి, పది ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు రాజమహేంద్రవరం పోలీసులు వెల్లడించారు.

మరోవైపు ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ విచారం వ్యక్తం చేశారు. బాధ్యులు ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేధింపులు లేదా బెదిరింపులు ఎదురైతే ఆత్మహత్యకు పాల్పడకుండా పోలీసులను ఆశ్రయించాలని ఆయన సూచించారు.

Also Read: Tirupati: స్వాతంత్ర్య వేడుకల్లో షాక్.. ప్రసంగిస్తూ కిందపడిపోయిన మంత్రి!