Andhra Pradesh: భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Mild tremors struck the Alluri Sitarama Raju (ASR) district

Mild tremors struck the Alluri Sitarama Raju (ASR) district

Andhra Pradesh: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతంలో అర్ధరాత్రి భూమి కంపించడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. శనివారం రాత్రి సుమారు 11:31 గంటల సమయంలో పాడేరు ఏజెన్సీతో పాటు పరిసర మండలాల్లో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు.

ప్రధానంగా పాడేరు, అరకు వ్యాలీ, హుకుంపేట, పెదబయలు మండలాల్లో ఈ ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కూడా కంపనలు నమోదయ్యాయి. కొన్ని ఇళ్లలో వస్తువులు కిందపడటంతో ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రకంపనలు సుమారు 3 నుంచి 5 సెకన్ల పాటు కొనసాగినట్లు స్థానికులు తెలిపారు.

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, ఈ భూకంపానికి కేంద్రం ఒడిశాలోని కోరాపుట్ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైందని, భూమి అంతర్భాగంలో సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించారు.

కొండ ప్రాంతాలు కావడంతో ఇలాంటి సమయంలో కొండచరియలు విరిగిపడతాయేమో అన్న భయం ప్రజల్లో నెలకొంది. అర్ధరాత్రి కావడంతో పిల్లలు, వృద్ధులతో కలిసి చాలామంది బయటే గడిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రత గల ప్రకంపనలు సాధారణంగానే పరిగణించబడతాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ భూమి కంపించినప్పుడు ఇళ్లలో ఉండకుండా ఖాళీ ప్రదేశాలకు వెళ్లడం సురక్షితమని సూచించారు.

Also Read: Telangana: ఫేస్ బుక్ ప్రేమ.. కట్నం వేధింపులు భరించలేక ఆత్మహత్య

Andhra Pradesh: భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం