LPG Crisis: హైదరాబాద్ నగరంలో ఇటీవల పెట్రోల్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త చెల్లింపు విధానం. ఇకపై బంకులకు ఇంధనం సరఫరా చేయాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాల్సిందేనని కంపెనీలు స్పష్టం చేశాయి.
గతంలో అయితే పరిస్థితి భిన్నంగా ఉండేది. ముందుగా ఆయిల్ సంస్థలు పెట్రోల్, డీజిల్‌ను బంకులకు సరఫరా చేసేవి. తర్వాత బంకు యజమానులు ఆ స్టాక్ అమ్మిన తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లో డబ్బులు చెల్లించేవారు. కానీ ఇప్పుడు ముందస్తు చెల్లింపు విధానం అమల్లోకి రావడంతో పరిస్థితి మారిపోయింది.
పాత బకాయిలను క్లియర్ చేయడంతో పాటు, కొత్తగా తీసుకునే స్టాక్‌కు కూడా ముందే డబ్బులు కట్టాల్సి రావడంతో పలు బంకు యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా నగరంలోని కొన్ని పెట్రోల్ బంకులు మూతపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా తెరిచి ఉన్న బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో ఒక్క రోజులోనే స్టాక్ అయిపోవడం, తిరిగి సరఫరా వచ్చే వరకు బంకులు మూసివేయడం జరుగుతోంది. ఈ పరిస్థితి కృత్రిమ కొరతలా కనిపిస్తోంది.
ఇక బంకు యజమానులు మాత్రం ఆయిల్ కంపెనీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కొత్త నియమాలు తీసుకురావడం సరికాదని, తమను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు, బంకుల మధ్య ఉన్న ఈ వివాదం వల్లే నగరంలో ఇబ్బందులు పెరిగాయని అంటున్నారు. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదని కూడా విమర్శిస్తున్నారు.
అయితే తెలంగాణ పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంటగ్యాస్ కొరత లేదని తెలిపారు. డిపోలలో తగినంత ఇంధనం నిల్వలుగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సమస్య కేవలం చెల్లింపు విధానంలో మార్పుల వల్ల తాత్కాలికంగా ఏర్పడిందని వివరించారు.
ప్రజలు అనవసరంగా భయపడకుండా ఉండాలని, పెట్రోల్ బంకులకు పరుగులు పెట్టి ఫుల్ ట్యాంక్‌లు చేయించుకోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. సరఫరాలో ఎలాంటి లోపం లేదని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
