Free Bus: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి రాబోయే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం టీజీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వానికి తన ప్రతిపాదనలు పంపింది.
ఈ ప్రతిపాదనల ప్రకారం, మహాలక్ష్మి పథకం కింద రీయింబర్స్‌మెంట్ కోసం సుమారు రూ.7 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని కోరింది. అదనంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.241 కోట్లు అవసరమని తెలిపింది. మొత్తం 680 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి రూ.442 కోట్లు, బస్ పాస్ రాయితీల కోసం రూ.358 కోట్లు కేటాయించాలని కూడా ప్రతిపాదించింది. కొత్త బస్టాండ్లు, డిపోలు నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మహాలక్ష్మి పథకం అమలుతో మహిళలు రాష్ట్రంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణిస్తున్నందున బస్సుల్లో రద్దీ పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఇక మహిళలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులను అందించనుంది. ప్రస్తుతం జీరో టికెట్ కోసం ఆధార్ కార్డు చూపించాల్సి రావడంతో, ఫోటో సరిపోకపోవడం వంటి కారణాలతో కొన్ని చోట్ల ఇబ్బందులు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యలను నివారించేందుకు క్యూఆర్ కోడ్, పేరు, జనన తేదీ వంటి వివరాలతో ప్రత్యేక స్మార్ట్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు.
జూన్ 2 నుంచి ఈ కార్డులను అర్హులైన మహిళలకు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. కార్డుల తయారీకి ఇప్పటికే సుమారు రూ.75 కోట్లు కేటాయించారు. మహిళల వివరాలను సేకరించి, వాటి ఆధారంగా కార్డులు ముద్రించనున్నారు. ఇకపై ఈ స్మార్ట్ కార్డు చూపిస్తే సులభంగా ఉచితంగా ప్రయాణించవచ్చు.
