Fake Ghee: వామ్మో.. పాలు లేకుండానే నెయ్యి.. 25 టన్నులు సీజ్..!

Fake Ghee Racket Busted in Hyderabad

Fake Ghee: హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్న ముఠాలపై పోలీసులు భారీగా దాడులు చేశారు. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి నగరంలోని 130 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇందులో 39 కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలు, 91 విక్రయ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ దాడుల్లో సుమారు 36 టన్నుల సరుకు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 25.5 టన్నుల కల్తీ నెయ్యి(Fake Ghee), 8.7 టన్నుల క్రీమ్(Cream), 1,200 లీటర్ల పామాయిల్(Palm Oil), 600 లీటర్ల వనస్పతి(Vanaspathi), స్టార్చ్(Starch_), కృత్రిమ నెయ్యి(Natural Ghee) ఫ్లేవర్లు ఉన్నాయి. అధికారులు నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు.

విచారణలో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న విధానం కూడా బయటపడింది. పామాయిల్, వనస్పతి, కృత్రిమ ఫ్లేవర్లను కలిపి నెయ్యిలా కనిపించేలా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరో పద్ధతిలో స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌కు పామాయిల్, డాల్డా, స్టార్చ్, కృత్రిమ ఫ్లేవర్లు కలుపుతున్నట్లు తేలింది.

ప్రతీకాత్మక చిత్రం

తయారైన నకిలీ నెయ్యిని “100% ప్యూర్ నెయ్యి”, “ప్రీమియం నెయ్యి”, “ఫార్మ్ ఫ్రెష్ నెయ్యి” వంటి పేర్లతో ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, FSSAI లైసెన్స్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలు కూడా లేవని గుర్తించారు.

ఈ కల్తీ నెయ్యిని పూజలు, దీపారాధనతో పాటు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, క్యాటరింగ్ సంస్థలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముడిసరుకులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తక్కువ ఖర్చుతో నకిలీ నెయ్యిని తయారు చేసి, అసలైన నెయ్యి ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కల్తీ పదార్థాలు ఆరోగ్యానికి హానికరం కావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాణ్యత లేని కొవ్వులు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తరచూ తీసుకోవడం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

ప్రజలు నెయ్యి, పాలు వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు ప్యాకింగ్ సీల్, తయారీదారు వివరాలు, FSSAI లైసెన్స్ తప్పకుండా పరిశీలించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పదంగా తక్కువ ధరకు లభించే బ్రాండ్ లేని ఉత్పత్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.

కల్తీ ఆహారంపై సమాచారం ఉంటే 112కు లేదా H-FAST వాట్సాప్ హెల్ప్‌లైన్ 8712661212కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Also Read: Colgate: భారీగా పెరగనున్న కోల్గేట్ ధర..!