Telangana: మహిళా దినోత్సవం సందర్భంగా సమాజం మహిళలను గౌరవంగా గుర్తు చేసుకుంటున్న వేళ, తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఒక తండ్రే తన ముగ్గురు ఆడపిల్లలను అత్యంత క్రూరంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్‌కు చెందిన ఇస్మాయిల్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన పిల్లలకు తినుబండారాలు కొనిస్తానని చెప్పి ఆటోలో బయటకు తీసుకెళ్లాడు. అనంతరం పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి, ఎలాంటి కనికరం లేకుండా ముగ్గురు చిన్నారులను నీటిలోకి తోసి చంపేశాడు. అల్లారుముద్దుగా పెరగాల్సిన పసిపిల్లలను ఇంత క్రూరంగా హత్య చేయడం స్థానికులను కలచివేసింది.
ఈ దారుణం అనంతరం ఇస్మాయిల్ ఇంటికి వెళ్లి ఏమీ తెలియనట్లుగా ప్రవర్తించాడు. తన పిల్లలు కనిపించడం లేదని చెప్పుతూ ఒక కథ అల్లాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో తండ్రి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతన్ని ప్రశ్నించారు.
పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా చివరకు ఇస్మాయిల్ చేసిన నేరం బయటపడింది. తానే తన పిల్లలను చెరువులోకి తోసి చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో ఆయాత్ (7), మరియం (5), సీఫల్ (8) అనే ముగ్గురు చిన్నారుల మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు. చిన్నారులు విగతజీవులుగా కనిపించడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ దారుణానికి అసలు కారణం ఏమిటన్న విషయంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఆడపిల్లలనే కారణంగా ఈ ఘటన జరిగిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీలో మరో ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు పట్టణంలో ఈ విధమైన సంఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మిస్సైన ఆ ఇద్దరు పిల్లల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను వేగవంతం చేశారు.
