Energy Lockdown: ట్రెండ్ అవుతున్న ఎనర్జీ లాక్‌డౌన్.. దీనర్థం ఏంటంటే..

Why is ‘India lockdown’ trending? COVID anniversary, war jitters, energy concerns double down on speculation

Why is ‘India lockdown’ trending? COVID anniversary, war jitters, energy concerns double down on speculation

Energy Lockdown: ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ దేశాలపై దాడులు వంటి పరిణామాలు ఆయిల్, గ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. దీంతో భారత్‌లో కూడా ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరా తగ్గుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో “ఎనర్జీ లాక్‌డౌన్” అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. అంటే, ఇంధన వనరులు అయిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ వంటి వాటి కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వాలు వినియోగాన్ని తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం. అవసరమైతే ఇవి తప్పనిసరి నియంత్రణలుగా అమలు చేయబడవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే చర్యల్లో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం, పరిశ్రమల పనివేళలను కుదించడం, ఎయిర్ కండీషనర్లు, లైట్ల వినియోగంపై నియంత్రణ విధించడం, అవసరం లేని ప్రయాణాలను తగ్గించడం వంటి అంశాలు ఉంటాయి.

ఇక ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. కరోనా సమయంలో ఉన్నట్లుగా పరిస్థితులు మారవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు వార్తలు రావడంతో, మళ్లీ లాక్‌డౌన్ ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను పరిశీలిస్తే, పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల వల్ల చమురు ఉత్పత్తి, రవాణా మార్గాలు ప్రభావితమవుతున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు ఇప్పటికే ఇంధనాన్ని ఆదా చేసే చర్యలు ప్రారంభించాయి. వారంలో కొన్ని రోజులు ఆఫీసులు మూసివేయడం, స్కూళ్లకు తాత్కాలిక సెలవులు ఇవ్వడం, పబ్లిక్ ప్రదేశాల్లో ఎసీ వినియోగాన్ని తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రోత్సహించడం, కార్ పూలింగ్ అమలు చేయడం వంటి చర్యలు చేపడుతున్నాయి.

ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ ఎనర్జీ ఏజెన్సీ కూడా కొన్ని సూచనలు చేసింది. హైవేలపై వాహనాల వేగాన్ని తగ్గించడం, అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని పెంచడం, వర్క్ ఫ్రమ్ హోమ్‌ను అమలు చేయడం వంటి సూచనలు ఉన్నాయి.

భారత్ విషయానికి వస్తే, మన దేశం చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతుంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో రవాణా ఖర్చులు పెరిగి, సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. చివరకు ఇది సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెంచుతుంది.

మొత్తంగా చూస్తే, “ఎనర్జీ లాక్‌డౌన్” అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎదురయ్యే ఇంధన సంక్షోభానికి సంకేతంగా భావిస్తున్నారు. పరిస్థితులు ఎలా మారుతాయో అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, ప్రజలు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Also Read: Health Tips: ఈ చిన్న చిట్కాలతో అజీర్తీ.. కొల‌ెస్ట్రాల్ మాయం

Energy Lockdown: ట్రెండ్ అవుతున్న ఎనర్జీ లాక్‌డౌన్.. దీనర్థం ఏంటంటే..