Holi Festival: హోలీ అంటే రంగుల పండుగ. స్త్రీ–పురుష భేదం లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుకగా ఇది దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో ఉన్న నగర్ అనే గ్రామంలో మాత్రం హోలీకి ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. అక్కడ దాదాపు ఐదు వందల ఏళ్లుగా హోలీ రోజున గ్రామంలో మహిళలకే ప్రాధాన్యం ఉంటుంది. ఆ రోజు పురుషులకు గ్రామంలో ప్రవేశం ఉండదు.
హోలీ రోజు ఉదయం నుంచే గ్రామంలోని మగవాళ్లంతా, చిన్న పిల్లలు నుంచి వృద్ధుల వరకు, గ్రామాన్ని వదిలి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. వారు గ్రామ శివార్లలోని చాముండీ మాత ఆలయంలో జరిగే జాతరకు హాజరై భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. భజనలు, పాటలు వింటూ రోజంతా అక్కడే గడుపుతారు. అప్పట్లో ఎవరైనా పురుషుడు నియమాన్ని ఉల్లంఘించి గ్రామంలోనే ఉండి వేడుకలను చూస్తే కొరడా దెబ్బలు శిక్షగా వేయించేవారట. ఇప్పటికీ ఈ ఆచారాన్ని గౌరవించాల్సిందే. ఎవరైనా నియమం అతిక్రమిస్తే గ్రామాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని చెబుతారు.
ఈ సంప్రదాయం పరదా వ్యవస్థ కాలం నుంచి వచ్చిందని స్థానికులు చెబుతారు. పురుషులు ఉంటే మహిళలు స్వేచ్ఛగా బయటికి రావడం కష్టమవుతుందని భావించి, కనీసం ఆ ఒక్క రోజైనా మహిళలు నిర్భయంగా, ఆనందంగా వేడుక చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ పద్ధతి ప్రారంభమైందట. ఆ రోజు మహిళలు పురుషుల దుస్తులు ధరించి గ్రామంలో ఊరేగింపులు చేస్తారు, నృత్యాలు చేస్తారు, పాటలు పాడుతూ ఉత్సాహంగా గడుపుతారు.
హోలీ మరుసటి రోజు మాత్రం స్త్రీ, పురుషులు కలిసి రంగులు చల్లుకుంటారు. ఆడుతూ పాడుతూ సంబరాలు కొనసాగిస్తారు. వేడుక చివర్లో సరదాగా పురుషులను కొరడాలతో తాకుతూ ఉత్సవాన్ని ముగించడం అక్కడి ప్రత్యేకతగా చెప్పబడుతోంది.
ఈ ఆచారం ఎలా పుట్టుకొచ్చిందన్నది పక్కన పెడితే, ఆ ఒక్క రోజైనా మహిళలు తమకు నచ్చినట్లుగా స్వేచ్ఛగా సంబరాలు చేసుకోవడం ఒక విశేషం అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ గ్రామంలో పాటించబడుతోంది.
Also Read: Lunar Eclipse: చంద్రగ్రహణమైనా ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి!
Holi Festival: అక్కడ హోలీ సంబరాలకు మగాళ్లకు నో ఎంట్రీ
