Israel: ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఖండించింది. ఈ విషయంపై అనడోలు న్యూస్ ఏజెన్సీ ప్రతినిధులు సంప్రదించగా అధికారికంగా స్పందించింది. నెతన్యాహు మరణించారన్న వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారమని, ఆయన సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో నెతన్యాహుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన కుడిచేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడం గమనార్హం. దీంతో అది నిజమైన వీడియో కాదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా తయారుచేసిన వీడియో కావచ్చని పలువురు నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం నెతన్యాహు మరణించారని శత్రుదేశాలకు తెలియకుండా ఉంచేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ వీడియో విడుదల చేసి ఉండొచ్చని కూడా సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అయితే అధికారికంగా మాత్రం నెతన్యాహు క్షేమంగానే ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
