Sabarimala: తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం

Sabarimala Temple Opened For 'Mandalam Chirappu' Pilgrimage

Sabarimala Temple Opened For 'Mandalam Chirappu' Pilgrimage

Sabarimala: మండల పూజల సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామి ఆలయం భక్తులకు తెరుచుకుంది. నిన్న సాయంత్రం 5 గంటలకు భక్తుల శరణ నాదాల మధ్య ఆలయ ద్వారాలు తెరిచారు. తాజాగా మేల్‌శాంతిగా నియమితులైన ప్రసాద్ నంబూద్రి పవిత్ర పద్దెనిమిది మెట్లు అధిరోహించి, సన్నిధానంలో తలుపులు తెరచి తొలి పూజలు నిర్వహించారు. దీంతో మండల కాలానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

ఈ సీజన్‌లో శబరిమలను చేరే యాత్రికుల కోసం కేరళ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వైద్య—ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ట్రెక్కింగ్ మార్గం అంతటా పంపా నుంచి సన్నిధానం వరకు తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సెంటర్లు కూడా పలు చోట్ల సిద్ధంగా ఉంచారు. ప్రొఫెసర్లు, వైద్యులు, పీజీ విద్యార్థులు సహా మెడికల్ టీమ్ 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

శబరిమల చరిత్రలో మొదటిసారిగా పంపా మరియు సన్నిధానం ప్రాంతాల్లో ఆపరేషన్ థియేటర్లు ప్రారంభించడం ప్రత్యేకత. అదనంగా, పథనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో అత్యవసర కార్డియాలజీ సేవలను కూడా సిద్ధం చేశారు. తెలుగు, తమిళం, కన్నడతో పాటు పలు భాషల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేసి భక్తులకు మార్గదర్శనం అందిస్తున్నారు. ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో 04735 203232 హెల్ప్‌లైన్‌కి భక్తులు సంప్రదించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

యాత్రికులు కొన్నింటిని జాగ్రత్తగా పాటించాలని కూడా అధికారులు సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తమ వైద్య వివరాలను వెంట తీసుకురావాలని, పర్వత మార్గంలో నెమ్మదిగా, మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ప్రయాణించాలని సూచించారు. ఛాతీ నొప్పి, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. తాగునీటిగా కాచి చల్లార్చిన నీటినే ఉపయోగించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

Also Read: Ayyappa: అయ్యప్ప దీక్ష… ఆరోగ్య ప్రయోజనాలు!

Sabarimala: తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం