Ayyappa: శబరిమలలో కొలువై ఉన్న హరిహరసుతుడు అయ్యప్ప స్వామివారిని దర్శించుకునే ముందు భక్తులు 41 రోజుల దీక్షను ఎంతో భక్తిగా ఆచరిస్తారు. మణిమాలను ధరించి, కఠిన నియమ నిష్టలతో చేసే ఈ దీక్ష శారీరకంగా, మానసికంగా శుద్ధిని కలిగించేదిగా భావిస్తారు. నేలమీద పడుకోవడం, చల్లటి నీటితో స్నానం చేయడం, ఒక్కపూట భోజనం, పాదరక్షలు లేకుండా నడవడం వంటి నియమాలు దీక్షలో భాగం. ఈ సాదాసీదా జీవన విధానంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
దీక్ష సమయంలో నేలపైనే నిద్రించడం వల్ల వెన్నెముక బలపడటమే కాకుండా కండరాలకు కూడా శక్తి పెరుగుతుంది. రక్తప్రసరణ మెరుగుపడటంతో శరీరం చురుకుదనం సంతరించుకుంటుంది. తెల్లవారుజామునే నిద్రలేవడం, ఆపై చల్లటి నీటితో స్నానం చేయడం నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఈ కారణంగా భక్తుల ముఖంలో సహజమైన కాంతి కనిపిస్తుంది.
సాయంత్రం దీపారాధన సమయంలో ఆ పరిసరాలు ఆధ్యాత్మికతతో నిండిపోతాయి. శ్రద్ధగా పూజల్లో పాల్గొనడం మనసును ప్రశాంతం చేస్తుంది. భక్తులు సమూహంగా నివసించడం వల్ల క్రమశిక్షణ, పరస్పర సహకారం, సహన భావాలు పెరుగుతాయి. ప్రతిరోజూ దుస్తులను శుభ్రపరచుకోవడం, పూజలో పాల్గొనడం వంటి అలవాట్లు కూడా మంచి శీలాలను పెంపొందిస్తాయి.
వివాదాలు, వృథా ప్రసంగాలు దూరం పెట్టడం వల్ల భక్తులు తమలోనే స్థిరపడతారు. ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఒక్కపూట మాత్రమే, అది కూడా శాకాహారం తీసుకోవడం మితాహారాన్ని అలవాటు చేస్తుంది. మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి — ఇవి దీక్షలో ప్రధాన నియమాలుగా చెప్పవచ్చు.
అయ్యప్ప దీక్షలో 40 రోజుల వ్యవధికి కూడా ప్రత్యేకత ఉంది. సంవత్సరాన్ని 360 రోజులుగా తీసుకుంటే, దానిని తొమ్మిదితో భాగిస్తే 40 రోజులు వస్తాయి. ఈ 40 రోజుల్ని “మండల కాలం”గా పరిగణిస్తారు. మండల కాలం పాటు చేసే దీక్ష మన జీవితానికి మంచి పునాది వేస్తుందని శాస్త్రం చెబుతుంది. ఏ అలవాటునైనా 40 రోజుల పాటు నియంత్రిస్తే, దీక్ష తర్వాత కూడా నిగ్రహం కొనసాగుతుందని భావిస్తారు.
అనవసర హంగులు, ఆర్భాటాలకు దూరంగా, సాధారణ జీవనం గడపడం అయ్యప్ప స్వామి దీక్ష యొక్క అసలు లక్ష్యం. ఈ క్రమంలో భక్తులు పవిత్రమైన ఆచారాలను పాటిస్తూ ఇరుముడి కట్టుకుని స్వామివారి దర్శనానికి బయలుదేరుతారు.
Also Read: Bihar: బిహార్ సీఎంగా మరోసారి నితీశ్..??
Ayyappa: అయ్యప్ప దీక్ష… ఆరోగ్య ప్రయోజనాలు!
