మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌కు చెందిన న్యాయవాది మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ. అతడు రెండు సార్లు NEET పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. రెండోసారి 530 మార్కులు సాధించాడు. ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా బలహీన వర్గం) కోటా కింద కనీసం ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వస్తుందని ఆశపడ్డాడు. కానీ కౌన్సెలింగ్ చివరి రౌండ్ పూర్తయినా అతడికి సీటు దక్కలేదు. దీనిపై పరిశీలించగా, తన రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయకపోవడం కారణమని గుర్తించాడు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రిజర్వ్ సీట్లు అమల్లో ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇది తనలాంటి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అన్యాయం అవుతుందని భావించి, జనవరి 6న స్వయంగా స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) తయారు చేసి సుప్రీంకోర్టులో దాఖలు చేశాడు.
ఈ కేసు విచారణలో అథర్వ కోర్టును 10 నిమిషాలు సమయం ఇవ్వాలని కోరాడు. ఆ సమయంలో తన వాదనలను స్వయంగా స్పష్టంగా వివరించాడు. అతని పరిస్థితిని, విధానపరమైన లోపాల వల్ల చదువుకు ఆటంకం కలిగిందని సుప్రీంకోర్టు గుర్తించింది. ప్రైవేట్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయకపోవడం వల్ల అడ్మిషన్ నిరాకరించడం సరైంది కాదని పేర్కొంది.
దీంతో 2025–26 విద్యాసంవత్సరంలో అథర్వకు మెడికల్ అడ్మిషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. తన పట్టుదలతో, స్వయంగా వాదనలు వినిపించి న్యాయం సాధించిన ఈ యువకుడు అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచాడు.
NEET: ‘10 మినిట్స్ ప్లీజ్’.. సుప్రీంకోర్టులో అదరగొట్టిన 19 ఏళ్ల విద్యార్థి
