Trump: అమెరికాలో లైంగిక నేరాల కేసులతో కుప్పకూలిన వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన కొన్ని డాక్యుమెంట్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒక మహిళ చేసిన ఆరోపణలు వెలుగులోకి రావడంతో రాజకీయంగా వివాదం చెలరేగింది. అయితే ఈ ఆరోపణలకు తాను సంబంధం లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా న్యాయశాఖ వెల్లడించిన ఎఫ్‌బీఐ విచారణ పత్రాల్లో 2019లో ఒక మహిళతో నిర్వహించిన ఇంటర్వ్యూల వివరాలు ఉన్నాయి. ఆ మహిళ ప్రకారం, తాను 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో ఉన్నప్పుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ తనను ట్రంప్‌కు పరిచయం చేశాడని తెలిపింది. ఆ తర్వాత ట్రంప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ఎప్‌స్టీన్ తనను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్‌కు పరిచయం చేశాడని కూడా ఆ మహిళ వెల్లడించింది.
ఆమె చెప్పిన వివరాల ప్రకారం, ట్రంప్ ఓరల్ సెక్స్‌కు బలవంతం చేశారని, దానికి ప్రతిగా తాను ఆయనను కొరికినట్లు విచారణ అధికారులకు తెలిపింది. అంతేకాదు, ఎప్‌స్టీన్‌తో ఉన్న సంబంధాల గురించి బయట చెప్పకుండా ఉండాలని తనతో పాటు తన సన్నిహితులకు బెదిరింపు కాల్స్ వచ్చాయని కూడా ఆమె పేర్కొంది.
అయితే ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ట్రంప్‌పై ఉన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని అమెరికా న్యాయశాఖ కూడా తెలిపింది. గతంలో విడుదల చేసిన కొన్ని పత్రాల్లో అధ్యక్షుడిపై అసత్యమైన, సంచలనాత్మక వాదనలు ఉన్నాయని కూడా న్యాయశాఖ పేర్కొంది.
ఈ వ్యవహారంపై డెమొక్రాట్లు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలను ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం దాచిపెట్టిందని వారు ఆరోపిస్తున్నారు. తాజాగా విడుదలైన పత్రాలు ట్రంప్‌కు ఇబ్బందులు కలిగించేలా ఉన్నాయని కూడా అంటున్నారు.
ఇక ట్రంప్ మరియు ఎప్‌స్టీన్ మధ్య పరిచయం కొత్తది కాదు. 1980ల చివరి నుంచి వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారని తెలిసింది. అనేక సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించిన ఫొటోలు కూడా ఉన్నాయి. అయితే పామ్ బీచ్‌లోని ఓ భవనం కొనుగోలు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ట్రంప్ తెలిపారు.
ఎప్‌స్టీన్ ప్రవర్తన నచ్చకపోవడం, అలాగే తన క్లబ్‌లోని ఓ సభ్యుడి కుమార్తెను వేధించడంతో 2007లో మార్-ఏ-లాగో రిసార్ట్ నుంచి ఎప్‌స్టీన్‌ను బయటకు పంపించామని వైట్ హౌస్ గతంలో వెల్లడించింది.
ఇదిలా ఉండగా, అమెరికా న్యాయశాఖ వెబ్‌సైట్ నుంచి 40 వేలకుపైగా ఫైల్స్ మాయమయ్యాయని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదించింది. దీనిపై స్పందించిన న్యాయశాఖ ప్రతినిధి, మొత్తం 47,635 ఫైళ్లను సమీక్ష కోసం తాత్కాలికంగా ఆన్‌లైన్ నుంచి తొలగించామని, పరిశీలన పూర్తయ్యాక వాటిని మళ్లీ ప్రచురించే అవకాశం ఉందని తెలిపారు.
