child sudden heart attack, sudden cardiac arrest in children, playground death, Rajasthan school incident, child health emergency, sibling deaths, Gotan tragedy, heart attack in kids
Heart Attack: రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా గోటన్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందింది. ఈ విషాదం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
తలన్పూర్కు చెందిన రాజేంద్ర బాపేడియా కుమార్తె దివ్య స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఉదయం సుమారు 7:48 గంటల సమయంలో పాఠశాల ప్రార్థన ప్రారంభానికి ఇంకా సమయం ఉండటంతో, ఆమె మైదానంలో తోటి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే దివ్య ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు.

దివ్య కుటుంబంలో ఇది మొదటి విషాదం కాదు. గత ఏడాది సెప్టెంబర్ 9న ఆమె అన్నయ్య అభిషేక్ కూడా ఇలాగే అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో అభిషేక్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు నిలవలేదు. ఇద్దరు పిల్లలను ఒకే విధంగా కోల్పోవడం తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు దివ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురై, చిన్నారుల ఆరోగ్యంపై అవగాహన అవసరమని అభిప్రాయపడుతున్నారు.
Heart Attack: తొమ్మిదేళ్ల బాలికకు గుండెపోటు