Facts: మనిషి శరీర నిర్మాణం నిజంగా అద్భుతంగా ఉంటుంది. పుట్టినపుడు ఒక శిశువు శరీరంలో సుమారు 306 ఎముకలు ఉంటాయి. అయితే వయస్సు పెరుగుతున్న కొద్దీ అవి 206కి తగ్గిపోతాయి. ఈ మధ్యలో మిగిలిన 100 ఎముకలు ఎక్కడికి పోతాయి? అనే సందేహం చాలా మందికి వస్తుంది.
నిజానికి, పసిపిల్లల ఎముకలు చాలా మృదువుగా, వంచుకోగలిగే విధంగా ఉంటాయి. ప్రసవ సమయంలో తల్లికి, శిశువుకు సౌలభ్యం కలిగించేందుకు పుర్రెలోని ఎముకలు విడివిడిగా ఉంటాయి. ఇది బిడ్డ తల పరిమాణం మారేందుకు, మెదడు సరిగా పెరగడానికి సహాయపడుతుంది.
కానీ పిల్లలు పెరుగుతున్న కొద్దీ, ఆ చిన్న చిన్న ఎముకలు, మృదులాస్థి భాగాలు నెమ్మదిగా గట్టిపడి ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఉదాహరణకు, పుర్రె ఎముకలు, వెన్నెముక భాగాలు, కటి ఎముకలు కలవడంతో మొత్తం సంఖ్య తగ్గుతుంది.
ఇది ఒక సహజ శారీరక మార్పు మాత్రమే. ఎముకలు కలవడం వల్ల మన శరీరం మరింత బలంగా మారుతుంది, శారీరకంగా స్థిరత్వం పొందుతుంది.
అందుకే చిన్నప్పుడు మన శరీరం ఎక్కువ వంచుకోగలిగేంత సులభంగా ఉండగా, పెద్దయ్యాక కఠినంగా మారుతుంది. ఇలా శిశువు నుంచి యుక్తవయస్సు దాకా శరీర నిర్మాణంలో జరిగే ఈ అద్భుత మార్పు మన శరీర వికాసానికి నిదర్శనం.
