Blood Pressure: ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!

Two Injections A Year For Blood Pressure? Lancet Review Signals Major Shift In Hypertension Care

Two Injections A Year For Blood Pressure? Lancet Review Signals Major Shift In Hypertension Care

Blood Pressure: రక్తపోటు (బీపీ) నియంత్రణ కోసం రోజూ మాత్రలు తీసుకోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో మారే అవకాశం కనిపిస్తోంది. శాస్త్రవేత్తలు కొత్త చికిత్సా విధానంపై పరిశోధనలు చేస్తుండగా, ఏడాదికి కేవలం రెండు ఇంజెక్షన్లు వేయించుకుంటే బీపీని నియంత్రించవచ్చని ఆశాజనక ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ అంశంపై ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్ కూడా ఒక పరిశోధన వ్యాసాన్ని ప్రచురించింది.

ఆ నివేదిక ప్రకారం, అమెరికాకు చెందిన రోష్ మరియు అల్నైలమ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థలు కలిసి జిలెబెసిరన్ (Zilebesiran) అనే కొత్త ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేశాయి. ఇది ఆధునిక ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ మందు మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ప్రారంభ పరీక్షల్లో మంచి ఫలితాలు కనిపించడంతో వైద్య రంగంలో ఆసక్తి పెరిగింది.

మన శరీరంలో కాలేయం నుంచి ఉత్పత్తి అయ్యే యాంజియోటెన్సినోజెన్ అనే ప్రోటీన్ రక్తపోటు పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. జిలెబెసిరన్ ఇంజెక్షన్ ఈ ప్రోటీన్ ఉత్పత్తిని తగ్గించేలా పనిచేస్తుంది. దీంతో రక్తపోటు సహజంగా నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. పరిశోధనల్లో ఒకసారి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత దాని ప్రభావం సుమారు ఆరు నెలల పాటు కొనసాగినట్టు గుర్తించారు. అంటే సంవత్సరానికి రెండు సార్లు తీసుకుంటే సరిపోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇది పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఇంకా తుది పరీక్షలు, అనుమతులు అవసరం ఉన్నప్పటికీ, భవిష్యత్తులో బీపీ చికిత్సలో ఇది పెద్ద మార్పు తీసుకురావొచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోజూ మందులు మర్చిపోతున్న రోగులకు, దీర్ఘకాల చికిత్స అవసరమైన వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉండొచ్చు.

అయితే ఈ ఇంజెక్షన్ మార్కెట్‌లోకి వచ్చే వరకు ప్రస్తుతం వైద్యులు సూచించిన మాత్రలు, జీవనశైలి మార్పులు కొనసాగించడం తప్పనిసరి. భవిష్యత్తులో సులభమైన, దీర్ఘకాల ప్రభావం ఉన్న చికిత్సగా ఈ కొత్త విధానం నిలుస్తుందనే ఆశలు ఉన్నాయి.

Also Read: Cervical Cancer: సర్వైకల్ క్యాన్సర్‌ ఎలా వస్తుంది?

Blood Pressure: ఏటా 2 ఇంజెక్షన్లు.. బీపీకి చెక్!