Ugadi 2026: ఉగాది పచ్చడికి వేప పువ్వు కొరత?

Ugadi 2026: Shortage of Neem Flowers for Ugadi Pachadi?

Ugadi 2026: Shortage of Neem Flowers for Ugadi Pachadi?

Ugadi 2026: వేప చెట్టు ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా ప్రసిద్ధి పొందింది. వేప ఆకు, వేప పూత, వేప గింజలు ఇలా చెట్టు ప్రతి భాగం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలు ఉండటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే వృక్ష సంపదలో వేపకు ప్రత్యేక స్థానం ఉంది. మంచి నీడను ఇవ్వడం, పర్యావరణానికి మేలు చేయడం వల్ల చాలా మంది తమ ఇళ్ల ఆవరణలో వేప చెట్టును పెంచేందుకు ఆసక్తి చూపిస్తారు.

హిందూ సంప్రదాయంలో కూడా వేప చెట్టుకు విశేష ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఉగాది పండుగలో వేప పూత కీలక పాత్ర పోషిస్తుంది. ఉగాది పచ్చడిలో వేప పువ్వు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దీనిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి.

అయితే ప్రస్తుతం ఈ విలువైన వేప చెట్లకు ఒక పెద్ద ప్రమాదం ఎదురవుతోంది. ఫంగస్ వ్యాధి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక వేప చెట్లు ఎండిపోతున్నాయి. మొదట చిగురాకుల నుంచి ప్రారంభమయ్యే ఈ సమస్య, క్రమంగా ఆకులు, కొమ్మలకు వ్యాపిస్తుంది. సాధారణంగా పూత పూయాల్సిన సమయంలో చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీంతో సహజంగా వేప పువ్వుల లభ్యత తగ్గిపోయింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వందలాది వేప చెట్లు ఈ సమస్యతో ఎండిపోతున్నాయి. వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ వివరాల ప్రకారం, ‘ఫోమాప్సిస్ అజాడిరక్టె’ అనే శిలీంద్రం (ఫంగస్) కారణంగా ఈ సమస్య వస్తోంది. దీనిని ‘డైబ్యాక్’ లేదా ‘కొమ్మ ఎండు తెగులు’ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి మొదట ఉత్తరాఖండ్‌లో గుర్తించబడగా, తరువాత దేశవ్యాప్తంగా విస్తరించింది. తెలంగాణలో 2016లో తొలిసారిగా ఈ ఫంగస్ గుర్తించబడింది.

ఈ వ్యాధి సోకిన చెట్లలో కొమ్మల చివర ఆకులు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. పూత, కాయలు ఏర్పడటం తగ్గిపోతుంది. ఈ శిలీంద్రం గాలి ద్వారా ఒక చెట్టునుంచి మరొక చెట్టుకు సులభంగా వ్యాపిస్తుంది. దీంతో గాలి వీచే దిశలో ఉన్న చెట్లు కూడా ప్రభావితమవుతాయి.

ఈ సమస్యను నియంత్రించేందుకు వ్యాధి సోకిన కొమ్మలను కత్తిరించి కాల్చివేయాలి. అలాగే కార్బండిజమ్, క్లోరోథలోనిల్, మాంకోజెబ్ వంటి శిలీంధ్రనాశకాలను నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేయడం లేదా వేర్ల వద్ద పోయడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు. తెగులు తీవ్రమైతే చెట్టు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.

అయితే వేప చెట్టుకు సహజంగానే వ్యాధులను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరైన సంరక్షణ తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. ప్రస్తుతం వేప పూల కొరత కారణంగా ఉగాది పండుగ సందర్భంగా పచ్చడి కోసం వేప పువ్వులు ఎలా పొందాలన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది.

Also Read: Kalvakuntla Kavitha: కవిత కొత్త పార్టీ పేరు ఇదే..!

Ugadi 2026: ఉగాది పచ్చడికి వేప పువ్వు కొరత?