Sperm Count: పురుషుల సంతానోత్పత్తి ఆరోగ్యంలో స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యత కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒక మిల్లీలీటర్ (mL) వీర్యంలో కనీసం 20 మిలియన్ల స్పెర్మ్ కణాలు ఉండాలి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ స్థాయి కంటే తక్కువగా ఉంటే అది పురుషుల లైంగిక ఆరోగ్యంపై మరియు సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్యను నివారించాలంటే ముందుగా దాని కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రి ఆండ్రాలజీ & రీకన్‌స్ట్రక్టివ్ యూరాలజీ విభాగం హెడ్ డాక్టర్ సంజయ్ పాండే సూచిస్తున్నారు.
స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ఒకటి వరికోసెల్. ఇది వృషణాలకు సంబంధించిన సిరల వాపు. దీని వల్ల స్పెర్మ్ నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా లైంగికంగా సంక్రమించే వ్యాధులు, హెచ్ఐవీ, వృషణాల లేదా ఎపిడైమిస్ వాపు వంటి సమస్యలు కూడా స్పెర్మ్ ఉత్పత్తి మరియు గమనాన్ని ప్రభావితం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో స్పెర్మ్ బయటకు రావడాన్ని అడ్డుకునే మచ్చలు ఏర్పడతాయి.
హార్మోన్ల అసమతుల్యత కూడా ఒక ప్రధాన కారణం. థైరాయిడ్ లేదా అడ్రినల్ గ్రంథుల సమస్యలు టెస్టోస్టెరాన్ స్థాయిలను ప్రభావితం చేసి, స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గించవచ్చు. అదనంగా, రెట్రోగ్రేడ్ స్కలనం, స్కలనం లేకపోవడం, అంగస్తంభన లోపం వంటి సమస్యలు కూడా సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి.
జీవనశైలి అలవాట్లు కూడా స్పెర్మ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వినియోగం, అధిక బరువు, ఒత్తిడి, గాయాలు వంటి అంశాలు స్పెర్మ్ నాణ్యత మరియు పరిమాణాన్ని తగ్గించవచ్చు. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. రెగ్యులర్ వ్యాయామం టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. మద్యం తగ్గించడం, పొగ త్రాగడం మానేయడం, బరువును నియంత్రించడం వంటి చర్యలు సంతానోత్పత్తిని మెరుగుపరుస్తాయి.
విటమిన్ డి కూడా పురుషుల సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిశోధనల ప్రకారం విటమిన్ డి లోపం ఉన్న పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒక అధ్యయనంలో విటమిన్ డి లోపం ఉన్న పురుషులు ఒక సంవత్సరం పాటు రోజుకు 3000 IU విటమిన్ D3 తీసుకున్న తర్వాత వారి టెస్టోస్టెరాన్ స్థాయిలు సుమారు 25 శాతం పెరిగినట్లు గుర్తించారు. అలాగే విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సా విధానాలు కూడా అవసరం అవుతాయి. అంగస్తంభన లోపం తీవ్రమైతే పురుషాంగం ఇంప్లాంట్ విధానం ఉపయోగిస్తారు. ఇందులో ఫ్లెక్సిబుల్ సిలికాన్ సిలిండర్లు శస్త్రచికిత్స ద్వారా అమర్చబడతాయి. ఇవి అంగస్తంభన సామర్థ్యాన్ని మెరుగుపరచి ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి సహాయపడతాయి.
