Kidney Stones: ఏంటీ.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా.?

Beer for Kidney Stones: Myths Vs Facts

Beer for Kidney Stones: Myths Vs Facts

Kidney Stones: ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందికి ఎదురవుతున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో కిడ్నీ స్టోన్స్ ఒకటి. ఈ సమస్య గురించి సమాజంలో అనేక అపోహలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీర్ తాగితే కిడ్నీ రాళ్లు కరిగి బయటకు వస్తాయనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ బయటకు వస్తాయా?

చాలామంది బీర్ తాగితే మూత్రం ఎక్కువగా వస్తుందని, దీంతో కిడ్నీలో ఉన్న రాళ్లు కదిలి బయటకు వస్తాయని భావిస్తారు. నిజానికి బీర్ మూత్రం పరిమాణాన్ని కొంత పెంచవచ్చు. అయితే స్టోన్ సురక్షితంగా బయటకు రావడానికి ఇది సరైన విధానం కాదు. సాధారణంగా 5 మిల్లీమీటర్ల కన్నా చిన్న రాళ్లు కొన్ని సందర్భాల్లో సహజంగానే బయటకు రావచ్చు. కానీ పెద్ద రాళ్లు బలవంతంగా కదిలితే తీవ్రమైన నొప్పి కలగడం లేదా మూత్రనాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.

బీర్‌ను ఇంటి చిట్కాగా ఉపయోగించవచ్చా?

కొంతమంది మందులు తీసుకోవడం కంటే బీర్ తాగితే సరిపోతుందని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు అని వైద్యులు చెబుతున్నారు. బీర్‌లో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణమయ్యే అంశాల్లో ఒకటి. ఎక్కువగా బీర్ తాగితే శరీరంలో డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. దాంతో కొత్తగా రాళ్లు ఏర్పడే అవకాశాలు కూడా పెరుగుతాయి. అంతేకాదు ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, కిడ్నీలపై ఒత్తిడి వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

ఎక్కువ బీర్ తాగితే స్టోన్ త్వరగా బయటకు వస్తుందా?

ఇది కూడా ఒక పెద్ద అపోహ. ఎక్కువ బీర్ తాగితే స్టోన్ త్వరగా బయటకు వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అకస్మాత్తుగా మూత్రం ఎక్కువగా రావడం వల్ల స్టోన్ బయటకు వస్తుందని చెప్పలేం. ఒకవేళ స్టోన్ మూత్రనాళంలో ఇరుక్కుంటే తీవ్రమైన నొప్పి, వాంతులు, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు. ప్రస్తుతం వైద్యరంగంలో కొన్ని ప్రత్యేక మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవి మూత్రనాళంలోని కండరాలను సడలించి స్టోన్ సురక్షితంగా బయటకు రావడానికి సహాయపడతాయి.

బీర్ వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయమా?

కొంతమంది వైద్య చికిత్స ఖర్చుతో కూడుకున్నదని భావించి బీర్‌ను ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని చూస్తారు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న రాళ్లు మందులతోనే బయటకు రావచ్చు. అవసరమైతే ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా చిన్న శస్త్రచికిత్సతో కూడా స్టోన్స్‌ను సులభంగా తొలగించవచ్చు. ఇవన్నీ బీర్ తాగడం కంటే చాలా సురక్షితమైన మార్గాలు.

డాక్టర్ల అభిప్రాయం

యూరాలజీ నిపుణుల ప్రకారం బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి లేదా బయటకు వస్తాయి అనేది పూర్తిగా అపోహ. బీర్ కిడ్నీ రాళ్లను కట్ చేసి బయటకు తీసుకురాదు. కాబట్టి దీనిని చికిత్సగా భావించడం సరైంది కాదు. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. స్వయంగా బీర్ వంటి ప్రయోగాలు చేయడం ఆరోగ్యానికి హానికరం.

Also Read: Diabetes Diet: షుగర్‌ పేషెంట్స్‌ తినాల్సిన, తినకూడని పండ్లు ఇవే..!

Kidney Stones: ఏంటీ.. బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా.?