Health Checkup: ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్ను సంప్రదించడం సరిపోదు. ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలను నిర్దిష్ట కాల వ్యవధిలో చేయించుకోవడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనేక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.
ముఖ్యంగా CBC (Complete Blood Count) పరీక్ష ద్వారా రక్తహీనత (అనీమియా) వంటి సమస్యలను గుర్తించవచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే HbA1c పరీక్ష ద్వారా గత మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు లేదా షుగర్ ముప్పు ఉన్నవారు ఈ పరీక్షను తరచూ చేయించుకోవడం మంచిది.
లివర్ ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి LFT (Liver Function Test), కిడ్నీ పనితీరును అంచనా వేయడానికి KFT (Kidney Function Test) కీలకమైనవి. ఇవి శరీరంలోని ముఖ్య అవయవాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.
అదేవిధంగా, ఎముకల బలం కోసం విటమిన్ D పరీక్ష అవసరం. విటమిన్ D లోపం ఉంటే ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంది. గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ECG మరియు Lipid Profile పరీక్షలు ముఖ్యమైనవి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉంటే గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
ఇంకా థైరాయిడ్ సమస్యలను గుర్తించడానికి సంబంధిత పరీక్షలు, అలాగే ఇతర విటమిన్ లోపాలను తెలుసుకోవడానికి రక్తపరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలను సకాలంలో చేయించుకుని, అవసరమైతే చికిత్స ప్రారంభిస్తే ఆరోగ్య సమస్యలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
