Intermediate: ఇంటర్ తర్వాత ఏయే కోర్సులున్నాయంటే?

Best Courses After 12th | Complete Career Guide

Best Courses After 12th | Complete Career Guide

Intermediate: ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత చాలా మంది విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఏ కోర్సు చదివితే మంచి కెరీర్ ఉంటుందో అనే సందేహం ఎక్కువ మందిని వేధిస్తుంది. కొందరు విద్యార్థులు సరైన సమాచారం లేక అయోమయంలో పడుతుంటారు. ఈ సమయంలో కొంతమంది తల్లిదండ్రులు, స్నేహితులు లేదా శ్రేయోభిలాషులు సూచించిన కోర్సుల్లో చేరుతుంటారు. మరికొందరు తమ స్నేహితులు ఏ కోర్సులో చేరితే అదే కోర్సులో జాయిన్ అవుతూ తర్వాత ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి.

ఈ విషయంలో విద్యార్థులు తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యమని ప్రొఫెసర్ పెంచల శ్రీనివాస్ సూచిస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, విద్యార్థులు ఏ కోర్సులో చేరినా ఆ కోర్సుపై ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ రంగంలో విజయాన్ని సాధించడం సులభమవుతుంది.

ప్రస్తుతం ఇంటర్ తర్వాత అనేక ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, ఫిషరీస్ వంటి కోర్సులు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ కోర్సుల్లో అడ్మిషన్లు TS EAPCET పరీక్ష ద్వారా ఇస్తారు. ఇంటర్‌లో బైపీసీ లేదా ఎంపీసీ చదివిన విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులు. ఇవి నాలుగేళ్ల వ్యవధి గల ప్రొఫెషనల్ కోర్సులు కాగా, వీటిలో సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

అదే విధంగా డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మ్-డి వంటి కోర్సులు కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా TSEAPCET ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ, నాలుగేళ్ల బి.ఫార్మసీ, అలాగే ఆరేళ్ల ఫార్మ్-డి కోర్సులకు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అర్హులు.

ఇంటర్ అర్హతతోనే ఈ కోర్సుల్లో చేరే అవకాశం ఉన్నందున, సాధ్యమైనంత వరకు డిప్లొమా కంటే డిగ్రీ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు మెడికల్ షాపులు నిర్వహించడం లేదా ఫార్మాస్యూటికల్ రంగంలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక బి.ఫార్మసీ వంటి డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వారు రీసెర్చ్, ఉన్నత విద్య వంటి రంగాల్లో ముందుకు వెళ్లవచ్చు.

అయితే ఫార్మ్-డి కోర్సు చదివిన వారికి మన దేశంలో తగిన స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్సు ఎంపికలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సరైన కోర్సును ఎంపిక చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.

Also Read: Bihar: సీఎం పదవికి నీతీశ్‌ కుమార్‌ బైబై

Intermediate: ఇంటర్ తర్వాత ఏయే కోర్సులున్నాయంటే?