Tamil Nadu: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌కు మరోసారి సీబీఐ నోటీసు జారీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆదేశించింది. ఈ మేరకు మార్చి 10, 2026న విచారణకు రావాల్సిందిగా నోటీసులో పేర్కొంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ కరూర్‌లో ఒక భారీ సభ నిర్వహించారు. ఆ సభకు అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే సభా ప్రాంగణంలో సరైన నిర్వహణ లేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.
ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సభ నిర్వహణలో మేనేజ్మెంట్ లోపాలు ఉన్నాయనే అనుమానంతో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో భాగంగా టీవీకే పార్టీకి చెందిన పలువురు నాయకులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
అలాగే విజయ్ను కూడా ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి పిలిపించి విచారించారు. జనవరి 12 మరియు జనవరి 19 తేదీల్లో ఆయన విచారణకు హాజరైనట్లు సమాచారం. అయితే తాజాగా సేకరించిన ఆధారాలు, సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మరికొన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయ్ను మరోసారి విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేశారు. ఎన్నికల సమయం దగ్గరలో ఉండటంతో ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Tamil Nadu: ఎన్నికల వేళ.. విజయ్‌కి బిగ్ షాక్