Maruti SUV: మారుతీ తొలి ఈవీ SUV కారు.. ఫీచర్స్ ఇవే!

Maruti Suzuki launches e-Vitara at Rs 10.99 lakh with battery-as-a-service option

Maruti Suzuki launches e-Vitara at Rs 10.99 lakh with battery-as-a-service option

Maruti SUV: భారత మార్కెట్లో మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారా (e-Vitara) ప్రారంభ ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ SUV ధరలు రూ.10.99 లక్షల నుంచి మొదలవుతాయని కంపెనీ తెలిపింది. అయితే ఈ ప్రారంభ ధర BAAS (Battery as a Service) పథకం కింద ఉంటుంది. అంటే బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ.3.99 చొప్పున అదనంగా చెల్లించాలి. ఈ ధర 49kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే బేస్ డెల్టా వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇతర వేరియంట్‌ల పూర్తి ధరలను ఇంకా ప్రకటించలేదు. ఈ కారును బుక్ చేయాలంటే రూ.21,000 అడ్వాన్స్ చెల్లించాలి. మొదటి సంవత్సరం ఛార్జింగ్ ఉచితం అయినా, హోమ్ ఛార్జర్ మాత్రం ధరలో ఉండదు.

ఇ-విటారా మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది – డెల్టా (బేస్), జీటా (మిడ్), ఆల్ఫా (టాప్). ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో వస్తుంది. డెల్టా వేరియంట్‌లో 49kWh బ్యాటరీ ఉండగా, మిగిలిన వేరియంట్‌లలో 61kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పెద్ద బ్యాటరీతో కంపెనీ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 543 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని చెబుతోంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే, 7.4kW ఛార్జర్‌తో 49kWh బ్యాటరీని సుమారు 6.5 గంటల్లో, 61kWh బ్యాటరీని సుమారు 9 గంటల్లో 10–80% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ DC ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 45 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ఛార్జింగ్ సమయం మారొచ్చని కంపెనీ తెలిపింది.

సేఫ్టీ పరంగా ఈ కారు భారత్ NCAP 5-స్టార్ రేటింగ్ పొందింది. ఫీచర్లలో ADAS లెవల్-2, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పవర్ డ్రైవర్ సీటు వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. అదనంగా బైబ్యాక్ స్కీమ్ కూడా అందిస్తున్నారు.

ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించింది. దేశవ్యాప్తంగా 1100కిపైగా నగరాల్లో 2000కిపైగా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. e for Me యాప్ ద్వారా ప్రతి 10 కిలోమీటర్ల పరిధిలో ఛార్జర్ సమాచారం తెలుసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే 1500కి పైగా EV వర్క్‌షాప్‌లు కూడా సిద్ధంగా ఉంచింది.

రంగుల పరంగా ఈ కారు మొత్తం 11 కలర్స్లో లభిస్తుంది. వీటిలో ఒపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, నెక్సా బ్లూ వంటి ఆప్షన్‌లు ఉన్నాయి. కొత్త డ్యూయల్-టోన్ కలర్స్‌లో ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్ప్లెండిడ్ సిల్వర్, ఒపులెంట్ రెడ్, ఆర్కిటిక్ వైట్ ఉన్నాయి.

Also Read: Head Wash: హెయిర్ వాష్ 2 సార్లు చేసుకోవాలా?

Maruti SUV: మారుతీ తొలి ఈవీ SUV కారు.. ఫీచర్స్ ఇవే!