Gold: బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలా మంది ముందుగా ధరలనే పోల్చి చూస్తారు. కానీ ధరతో పాటు బంగారం నాణ్యత, స్వచ్ఛత కూడా చాలా ముఖ్యమైన అంశాలు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో గోల్డ్ జువెలరీ కొనేవారు ఎక్కువగా ఉంటారు. మహిళలు అలంకరణ కోసం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో కేవలం డిజైన్ లేదా ధర మాత్రమే కాకుండా ప్యూరిటీపై కూడా తప్పనిసరిగా దృష్టి పెట్టాలి.
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని అత్యంత స్వచ్ఛమైనదిగా భావిస్తారు. ఇందులో ఇతర లోహాలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా 24 క్యారెట్ గోల్డ్‌ను నాణేలు, గోల్డ్ బార్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. 999 ప్యూర్ గోల్డ్ అంటే అదే 24 క్యారెట్ గోల్డ్. ఇందులో సుమారు 99.9 శాతం బంగారం ఉండగా, మిగిలిన భాగం చాలా స్వల్పంగా ఇతర లోహాలు ఉంటాయి.
అయితే ఆభరణాల తయారీలో మాత్రం సాధారణంగా 18 నుంచి 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం చాలా మృదువుగా ఉండటంతో ఆభరణాలుగా తయారు చేయడం కష్టం. అందుకే బలం పెంచేందుకు కొద్దిగా ఇతర లోహాలు కలుపుతారు.
ఇంతకుముందు బంగారం నాణ్యత తెలుసుకోవడానికి టచ్ స్టోన్ వంటి పాత పద్ధతులను ఉపయోగించేవారు. కానీ అవి పూర్తిగా ఖచ్చితమైన ఫలితాన్ని ఇవ్వవు. అందుకే ప్రస్తుతం బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా BIS హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలనే కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత ప్రమాణాల సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) బంగారం సహా విలువైన లోహాలకు హాల్‌మార్క్ ధ్రువీకరణ ఇస్తుంది.
హాల్‌మార్క్‌ను గుర్తించేందుకు మూడు ముఖ్యమైన గుర్తులు ఉంటాయి:
-
BIS లోగో
-
ప్యూరిటీ లేదా క్యారెట్ గ్రేడ్ వివరాలు
-
ఆరు అంకెల ప్రత్యేక అల్ఫాన్యూమరిక్ కోడ్ (HUID)
ఈ HUID కోడ్ ద్వారా ఆ ఆభరణం అసలైనదో కాదో ట్రాక్ చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2019లో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ ప్రకటించింది. కరోనా కారణంగా గడువును పొడిగించి, 2021 నుంచి బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరిగా అమలు చేసింది. హాల్‌మార్క్ లేకుండా బంగారం విక్రయిస్తే BIS కు ఫిర్యాదు చేసే అవకాశం కూడా వినియోగదారులకు ఉంది.
