US-Israel Strike Iran: భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్’లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు బయలుదేరిన ఆమె, ట్రాన్సిట్ హబ్‌గా ఉన్న దుబాయ్ చేరుకున్నారు. అయితే ఆమె ఎక్కాల్సిన తదుపరి విమానం రద్దు కావడంతో అక్కడే నిలిచిపోయారు.
ప్రస్తుతం అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పశ్చిమ ఆసియా గగనతలంలో విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భద్రతా కారణాల వల్ల దుబాయ్ మీదుగా వెళ్లే అనేక విమానాలను అధికారులు రద్దు చేశారు. ఈ పరిణామాల కారణంగా సింధుతో పాటు వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఆగిపోయారు. అక్కడి పరిస్థితులు గందరగోళంగా మారినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేశారు. ఎయిర్‌పోర్టు ప్రయాణికులతో నిండిపోయి ఉండటం, తదుపరి ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. “తదుపరి అప్డేట్ వచ్చే వరకు అన్ని విమానాలు రద్దు చేశారు” అని ఆమె పేర్కొన్నారు. అలాగే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు.
“ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థం కావడం లేదు. ఆకాశంలో క్షిపణి దాడులు, పేలుళ్ల శబ్దాలు వినిపించడం భయాన్ని కలిగిస్తోంది. వార్తల్లో వస్తున్న దృశ్యాలు మరింత కలవరపెడుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే దుబాయ్‌లో ఇలాంటి పరిస్థితి చూస్తానని ఊహించలేదు” అని ఆమె తెలిపారు.
తన క్షేమంపై ఆరా తీసిన అందరికీ సింధు కృతజ్ఞతలు తెలిపారు. “నేను, నా టీమ్ సభ్యులు ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నాం. అయితే పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎయిర్‌పోర్టులో చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు సహా చాలా మంది ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మేమూ ఇక్కడి నుంచి సురక్షితంగా బయలుదేరాలని ఎదురుచూస్తున్నాం. ఇక్కడ చిక్కుకున్న ప్రతి ఒక్కరూ క్షేమంగా బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మరోవైపు భారత బ్యాడ్మింటన్ సంఘం కూడా స్పందించింది. సింధుతో పాటు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని తెలిపింది. ఇతర క్రీడాకారులు ఇప్పటికే గమ్యస్థానాలకు చేరుకున్నారని, సింధు ప్రయాణం కూడా త్వరలోనే సవ్యంగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read: Iran: ముస్లిం దేశాలపైనే ఇరాన్ దాడి ఎందుకు?
US-Israel Strike Iran: దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు
