Midday Meal: ఉప్పుకు బదులు డిటర్జెంట్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత!

Midday Meal: Detergent Powder Served Instead of Salt in Bihar

Midday Meal: బీహార్‌లోని నలంద జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పరాసి మిడిల్ స్కూల్‌లో మంగళవారం మధ్యాహ్న భోజనం(Midday Meal) తిన్న 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో ఉప్పుకు బదులుగా పొరపాటున డిటర్జెంట్ పౌడర్ వడ్డించడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. భోజనం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు మొదలయ్యాయి.

నూర్సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పాఠశాలకు మరో స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనం సరఫరా చేసినట్లు సమాచారం. విద్యార్థులకు వడ్డించిన సోయాబీన్ కూరలో ఉప్పు తక్కువగా ఉండటంతో వారు అదనంగా ఉప్పు అడిగారు. అయితే సిబ్బంది పొరపాటున ఉప్పుకు బదులుగా డిటర్జెంట్ పౌడర్ వడ్డించినట్లు పాఠశాల ఉపాధ్యాయుడు వెల్లడించారు. విషయం తెలియక కొందరు విద్యార్థులు దానిని భోజనంలో కలుపుకుని తిన్నారు.

Also Read: Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీపై కీలక ప్రకటన!

విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో పాఠశాల అధికారులు వెంటనే వారిని బీహార్ షరీఫ్ మోడల్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆందోళనగా ఎదురుచూశారు.

వైద్యులు వెంటనే విద్యార్థులకు చికిత్స అందించారు. నలంద సివిల్ సర్జన్ డాక్టర్ జై ప్రకాష్ సింగ్‌తో పాటు పలువురు వైద్యులు పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, అవసరమైన చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

Also Read: Fake Ghee: వామ్మో.. పాలు లేకుండానే నెయ్యి.. 25 టన్నులు సీజ్..!

ఈ ఘటనపై బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ కూడా స్పందించారు. ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించడంతో పాటు వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మధ్యాహ్న భోజనం తయారీ, పదార్థాల నిల్వ, వడ్డించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ ఘటన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తింది. అసలు డిటర్జెంట్ పౌడర్ ఆహార పదార్థాల దగ్గరకు ఎలా వచ్చింది? ఉప్పుకు బదులుగా విద్యార్థులకు ఎలా వడ్డించారనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

Also Read: AP News: ఆస్తి లేదని తండ్రి అంత్యక్రియలకు రాని కొడుకు