AP News: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆస్తిపాస్తులు ఇవ్వలేదన్న కారణంతో తండ్రి అంత్యక్రియలకు కన్నకొడుకు రాకపోవడంతో.. చివరకు కూతురే తలకొరివి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొన్నగల్లు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, శాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలు కాగా.. కొడుకు మురళీకృష్ణ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం చెన్నై వెళ్లిపోయాడు. సుమారు 15 ఏళ్ల క్రితం తల్లి శాంతమ్మ మృతి చెందింది. అప్పటి నుంచి వెంకటేశ్వర్లు ఒంటరిగానే జీవించాడు.
Also Read: Colgate: భారీగా పెరగనున్న కోల్గేట్ ధర..!
గత కొంతకాలంగా వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొడుకు గ్రామంలో లేకపోవడంతో ఆయనను చూసుకునే బాధ్యత పెద్ద కుమార్తె నాగరత్నంపై పడింది. భర్త మృతి చెందడంతో నాగరత్నం తండ్రి ఆలనాపాలనా చూసుకుంటూ వచ్చింది. ఇటీవల వెంకటేశ్వర్ల ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆయన మృతి చెందాడు.

తండ్రి మరణవార్తను చెన్నైలో ఉన్న మురళీకృష్ణకు గ్రామస్తులు, బంధువులు తెలియజేశారు. అయితే తండ్రి అంత్యక్రియలకు గ్రామానికి రావాల్సిన కొడుకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండ్రికి చివరి సంస్కారాలు నిర్వహించే బాధ్యతను పెద్ద కుమార్తె నాగరత్నమే తీసుకుంది.
కన్నకొడుకు దూరంగా ఉండటంతో.. నాగరత్నం తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. తండ్రిని చివరి వరకు చూసుకున్న కూతురే ఆయనకు చివరి వీడ్కోలు పలకడం స్థానికులను కలిచివేసింది. జన్మనిచ్చిన తండ్రి అంత్యక్రియలకు కొడుకు రాకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త రాజకీయ పార్టీపై కీలక ప్రకటన!
