Reddit Post: పెద్దలు కుదిర్చే వివాహాల్లో మారుతున్న అంచనాలపై ఓ రెడిట్ పోస్ట్ (Reddit Post) సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన 31, 32 ఏళ్ల వయసున్న ఇద్దరు కజిన్లకు గత ఐదేళ్లుగా సంబంధాలు చూస్తున్నామని రెడిట్ యూజర్ తెలిపాడు. వారిద్దరూ ఐటీ రంగంలో పనిచేస్తూ ఏడాదికి రూ.22 లక్షలకు పైగా సంపాదిస్తున్నారని, సొంత ఇళ్లు ఉండటంతో పాటు ఎలాంటి అప్పులు కూడా లేవని ఆ యూజర్ తెలిపాడు.
వారి కుటుంబాల్లో వారే ఏకైక కుమారులు కావడం, తల్లిదండ్రులు ప్రేమగా ఉండటం, గ్రామంలో వ్యవసాయ భూమి, పూర్వీకుల ఆస్తులు ఉండటం వంటి సానుకూల అంశాలు ఉన్నప్పటికీ సంబంధాలు కుదరడం లేదని చెప్పాడు. 2020–21లో విశాఖపట్నంలో సొంత ఇల్లు లేదనే కారణంతో కొన్ని కుటుంబాలు వారి ప్రొఫైల్స్‌ను తిరస్కరించాయని తెలిపాడు. ఆ తర్వాత సొంత ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ అవి EMIలో ఉండటంతో ఉద్యోగం పోతే తమ కూతురిపై ఆర్థిక భారం పడుతుందని భావించి కొన్ని సంబంధాలను తిరస్కరించినట్లు పేర్కొన్నాడు.
Also Read: Floating in Ponds: చెరువులోనే ఉంటున్న 16 ఏళ్ల యువకుడు!

అంతేకాకుండా, ఉద్యోగం చేయని లేదా కొద్దికాలం మాత్రమే పనిచేసిన అమ్మాయిల నుంచి కూడా అధిక అంచనాలు వస్తున్నాయని రెడిటర్ చెప్పాడు. అబ్బాయి తల్లిదండ్రులు వేరుగా ఉండాలని, రూ.2–3 కోట్ల విలువైన ఆస్తులు ఉండాలని, పెళ్లి సమయంలో 20–25 తులాల బంగారం ఇవ్వాలని కొన్ని కుటుంబాలు కోరినట్లు తెలిపాడు.
మరికొన్ని సందర్భాల్లో పెళ్లి తర్వాత ప్రతి ఏడాది విదేశీ పర్యటనకు తీసుకెళ్లాలని, పెళ్లికి సంబంధించిన మొత్తం ఖర్చును అబ్బాయి కుటుంబమే భరించాలని షరతులు పెట్టినట్లు పేర్కొన్నాడు. అయితే తన కజిన్లు, వారి కుటుంబాలు కట్నం కోరేవారు కాదని, తమ కుమారులకు మంచి అమ్మాయి దొరకడమే ముఖ్యమని స్పష్టం చేశాడు. ఈ పోస్ట్ ఆధారంగా పెళ్లిళ్లలో మారుతున్న ఆర్థిక, కుటుంబ అంచనాలపై ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది.
Also Read: Rajastan: రూ.5 లక్షలను పొలంలో పాతిపెట్టాడు.. ఏడాది తర్వాత చూస్తే..
