Kala Basha: హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ ప్రాంతానికి చెందిన మహ్మద్ కాలా బాషా (66), సోషల్ మీడియాలో ‘కుర్చీ తాత’గా ప్రసిద్ధి చెందిన ఆయన బుధవారం మృతి చెందాడు. హీరో మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలోని ‘ఆ కుర్చీని మడతపెట్టి’ పాటకు పరోక్షంగా కారణమైన వ్యక్తిగా కాలా బాషా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో పలువురు అభిమానులు, నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు.
కాలా బాషా బోరబండ పరిసర ప్రాంతంలో నివసించేవాడు. ప్రతిరోజూ యూసుఫ్‌గూడ, కృష్ణకాంత్ పార్క్ ప్రాంతాల్లో తిరుగుతూ కనిపించేవాడు. బస్సుల్లో ప్రయాణిస్తూ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ డబ్బులు అడిగేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఓ సంఘటనను వివరిస్తూ “కుర్చీని మడతపెట్టి” అనే పదాన్ని ఉపయోగించాడు.
ఆ డైలాగ్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. అనంతరం అదే పదాలతో ‘గుంటూరు కారం’ సినిమాలో పాట రావడంతో అది మరింత పాపులర్ అయింది. ఈ పాటకు దేశ విదేశాల్లోనూ మంచి స్పందన లభించింది. విదేశీయులు కూడా ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియోలు చేయడంతో అది ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయింది.
ఆ ఒక్క డైలాగ్‌తో కాలా బాషా ‘కుర్చీ తాత’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలు వైరల్ కావడంతో అనేక యూట్యూబ్ ఛానళ్లు ఆయనను ఇంటర్వ్యూ చేశాయి. అలా ఆయన సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయాడు.
అయితే కాలా బాషాకు మద్యం అలవాటు ఉండేదని, పలుమార్లు అనారోగ్యానికి కూడా గురయ్యాడని తెలిసింది. గతంలో కూడా ఆయన మరణించారంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చినా, అవి ఫేక్ న్యూస్‌గా తేలాయి. కానీ ఈసారి ఎండ తీవ్రతను తట్టుకోలేక బుధవారం సాయంత్రం కృష్ణకాంత్ పార్క్ వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడున్న వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా, ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆయన మృతి చెందినట్లు తెలిసింది.
