Virat Kohli: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్.. కోహ్లీ ఆదాయం ఎంతంటే..

Virat Kohli Richest IPL Player | Rohit second, Dhoni third

Virat Kohli Richest IPL Player | Rohit second, Dhoni third

Virat Kohli: ఐపీఎల్ కేవలం క్రికెట్ వినోదానికి మాత్రమే కాకుండా, భారీ ఆర్థిక సామ్రాజ్యంగా కూడా ఎదుగుతోంది. తాజాగా విడుదలైన ‘మోస్ట్ వాల్యూబుల్ స్పోర్ట్స్ టీమ్స్ 2026’ నివేదికలో ఐపీఎల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫెనాటిక్ స్పోర్ట్స్, హురూన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున మాత్రమే ఆడుతున్న కోహ్లీ, ఇప్పటివరకు మొత్తం రూ.230 కోట్ల ఆదాయం ఆర్జించి అగ్రస్థానంలో నిలిచాడు. ఒకే ఫ్రాంచైజీకి ఆడుతూ ఈ ఘనత సాధించడం విశేషంగా మారింది.

కోహ్లీ తర్వాత ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ మొత్తం రూ.227.2 కోట్ల ఆదాయం పొందినట్లు నివేదిక వెల్లడించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.200 కోట్ల ఐపీఎల్ సంపాదనతో మూడో స్థానంలో నిలిచాడు.

ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ కూడా భారీ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం లీగ్‌లో ఉన్న 10 జట్ల మొత్తం బ్రాండ్ విలువ దాదాపు రూ.1.63 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది సుమారు 18 బిలియన్ డాలర్లకు సమానం.

ఈ జాబితాలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలిచింది. కేకేఆర్ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.19,200 కోట్లకు పైగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. గ్లోబల్ స్థాయిలో బ్రాండ్ విస్తరణ, భారీ అభిమాన వర్గం ఈ జట్టుకు ప్రధాన బలంగా మారాయి.

ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు కూడా రూ.18,400 కోట్ల చొప్పున బ్రాండ్ విలువతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలుగా గుర్తింపు పొందాయి.

హురూన్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ, భారత క్రీడారంగంలో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఇదే వేగం కొనసాగితే 2032 నాటికి ఒక్కో ఐపీఎల్ జట్టు సగటు విలువ 15 బిలియన్ డాలర్ల వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు. భవిష్యత్తులో ఐపీఎల్ ఫ్రాంచైజీలు అమెరికా ఎన్ఎఫ్ఎల్ జట్ల స్థాయిలో ఆర్థికంగా పోటీ పడే స్థాయికి చేరవచ్చని ఆయన పేర్కొన్నారు.

Also Read: Rupee: ఫర్ ది ఫస్ట్ టైం.. 96 మార్కును దాటి కనిష్ట స్థాయికి..

Virat Kohli: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్.. కోహ్లీ ఆదాయం ఎంతంటే..